దక్షిణ కొరియాపై కరోనా దండయాత్ర!

ABN , First Publish Date - 2022-03-17T08:32:46+05:30 IST

ఓ వైపు కొవిడ్‌ భయాలతో చైనాలోని చాంగ్‌చున్‌, షెన్‌జెన్‌ సహా పలు ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి..

దక్షిణ కొరియాపై కరోనా దండయాత్ర!

  ఒక్కరోజే 4 లక్షలకుపైగా కొత్త కేసులు

 అత్యంత అప్రమత్తత అవసరం : కేంద్రం 

  12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభం 

సియోల్‌/న్యూఢిల్లీ, మార్చి 16: ఓ వైపు కొవిడ్‌ భయాలతో చైనాలోని చాంగ్‌చున్‌, షెన్‌జెన్‌ సహా పలు ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దాదాపు మూడు కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు దక్షిణకొరియాలోనూ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 4 లక్షల మందికిపైగా ప్రజలకు ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయింది. రాజధాని సియోల్‌ నగరం పరిధిలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన 4 లక్షల మందిలో 81,395 మంది సియోల్‌వాసులే. గత 24 గంటల్లో 164 మంది కరోనాతో మృతిచెందారు. దక్షిణ కొరియాలోని 87.5 శాతం జనాభాకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తవగా, 62.7 శాతం జనాభాకు టీకా బూస్టర్‌ డోసులు కూడా వేశారు. మరోవైపు హాంకాంగ్‌లోనూ 29,272 కొత్త కేసులు నమోదవగా, 228 మంది కొవిడ్‌తో చనిపోయారు. అయితే కొవిడ్‌ మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోని వృద్ధులేనని హాంకాంగ్‌ అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, గత వారం వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాలు 17 శాతం మేర తగ్గగా, కేసులు 8 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.  


అప్రమత్తమైన భారత్‌..  

చైనా, తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ను పెంచాలని నిర్దేశించారు. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్న నేపథ్యంలో దేశంలో కొవిడ్‌ స్థితిగతులు, వ్యాక్సినేషన్‌ తీరుతెన్నులపై ఆయన బుధవారం సమీక్షించారు. ఇక మధ్యప్రదేశ్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12-14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ బుధవారం ప్రారంభమైంది. కాగా, దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం శాస్ర్తీయ పద్ధతిలో, ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇకనుంచి 12-14 ఏళ్ల వయసు పిల్లలు టీకా వేయించుకునేందుకు అర్హులని, అలాగే 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్‌ డోసులు వేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికి దేశంలో 180 కోట్లకు పైగా టీకా డోసులు వేశారన్నారు.  

Updated Date - 2022-03-17T08:32:46+05:30 IST