Booster Doseకు సీఎం శ్రీకారం

ABN , First Publish Date - 2022-07-17T17:04:28+05:30 IST

ఆజాది కా అమృత మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు బూస్టర్‌ డోసు అభియానను 75 రోజులపాటు ఏకధాటిగా

Booster Doseకు సీఎం శ్రీకారం

                   - 75 రోజులపాటు నిరంతరంగా వ్యాక్సినేషన్‌ 


బెంగళూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఆజాది కా అమృత మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు బూస్టర్‌ డోసు అభియానను 75 రోజులపాటు ఏకధాటిగా కొనసాగించనున్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో శనివారం కొవిడ్‌ బూస్టర్‌డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 7,500 కేంద్రాల్లో 75 రోజులపాటు అభియాన జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన అర్హులంతా బూస్టర్‌డోసు వేయించుకుని కొవిడ్‌పై సమరానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బూస్టర్‌ డోసు వేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. ఆరోగ్యవంతమైన, ఆర్థికంగా పటిష్టమైన సమాజ నిర్మాణం జరగాలంటే ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. తొలి రెండు డోసుల వ్యాక్సిన్లను ప్రజలకు ఉచితంగా అందచేసిన కేంద్రం బూస్టర్‌డోసును కూడా ఉచితంగా అందచేస్తున్నందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. బూస్టర్‌ డోసుపై ప్రజల్లో జాగృతి తీసుకురావాలని ఆరోగ్య, ఆశా కార్యకర్తలకు ఆయన సూచించారు. రాష్ట్రంలో తొలి డోసు 102 శాతం మందికి ఇచ్చామని, 5.49 కోట్ల మంది మొదటి డోసును, 5.42 కోట్లమంది రెండోడోసు పొందారన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్లను శాస్త్రవేత్తలు సొంతంగా రూపొందించేలా ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ మాట్లాడుతూ 75 రోజుల వ్యవధిలో 18-59 ఏళ్ల వయసు కల్గిన 4.5 కోట్ల మందికి బూస్టర్‌డోసు అందిస్తామన్నారు. మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 470 నమ్మ క్లినిక్‌లు ప్రారంభిస్తామన్నారు. బెంగళూరులోనే 243 క్లినిక్‌లు ఏర్పాటు కానున్నాయన్నారు. ఈనెల 28 లేదా ఆగస్టు మొదటి వారంలో బెంగళూరులో తొలి క్లినిక్‌కు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లోనూ పాత్రికేయులకు ఉచిత బూస్టర్‌ డోసు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఆర్‌ శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి బీపీ మల్లప్ప ఈ సందర్భంగా పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-17T17:04:28+05:30 IST