Cooker bomb blast : మంగళూరులో కుక్కర్‌ బాంబు పేలుడు

ABN , First Publish Date - 2022-11-21T03:02:50+05:30 IST

కర్ణాటకలో మంగళూరులో కుక్కర్‌బాంబు పేలుడు సంచలనం రేకెత్తించింది. శనివారం సాయంత్రం కంకనాడి పోలీసుస్టేషన్‌ పరిధిలో గరోడి వద్ద ఆటోలో కుక్కర్‌ బాంబు పేలింది.

Cooker bomb blast : మంగళూరులో కుక్కర్‌ బాంబు పేలుడు

ఆటోలో తరలిస్తుండగా విస్పోటం

ఇద్దరికి తీవ్రగాయాలు

సీఎం పర్యటన ముగిసిన కాసేపటికే ఘటన

బెంగళూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో మంగళూరులో కుక్కర్‌బాంబు పేలుడు సంచలనం రేకెత్తించింది. శనివారం సాయంత్రం కంకనాడి పోలీసుస్టేషన్‌ పరిధిలో గరోడి వద్ద ఆటోలో కుక్కర్‌ బాంబు పేలింది. తొలుత ప్రమాదమని భావించినా, దర్యాప్తులో ఉగ్రవాద కుట్రగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శివమొగ్గ పోలీసులు గాలిస్తున్న షారిక్‌ (23) అనే వ్యక్తి ఈ పేలుడు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళూరులో పర్యటించారు. ఆయన వెనుదిరిగాక సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. కొంతకాలంగా మైసూరులో తలదాచుకున్న షారిక్‌ అక్కడే బాంబును తయారు చేసి ఉంటాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

అక్కడి నుంచి సుళ్య మీదుగా మంగళూరుకు బస్సులో వెళ్లిన షారిక్‌ తర్వాత ఆటోలో ప్రయాణిస్తుండగా, కుక్కర్‌ బాంబు పేలింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్‌ పురుషోత్తం తీవ్రంగా గాయపడ్డాడు. మంగళూరు, కోయంబత్తూరు మధ్య పేలుడుకు పాల్పడిన వ్యక్తి సంచరించినట్టు అనుమానాలు ఉన్నాయి. మైసూరులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తప్పుడు చిరునామాతో అనుమానితుడికి పది ఫోన్లు విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

శివమొగ్గ పేలుడు సూత్రధారి

సెప్టెంబరు 19న శివమొగ్గలోని తుంగానది సమీపాన బాంబు పేలుడు ఘటనలో సిద్దేశ్వరనగర్‌కు చెందిన సయ్యద్‌ యాసిన్‌ (21), మంగళూరు నమాజ్‌ మునీర్‌ (22)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో కీలక సూత్రధారి షారిక్‌ తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రస్తుతం బాంబుపేలుడు ఘటనలో పట్టుబడిన వ్యక్తి అతనేనని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన అనుమానితుడికి మంగళూరులోని ఫాదర్‌ ముల్లర్స్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో విచారణ సాధ్యం కావడం లేదని ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ ప్రకటించారు. బాంబు పేలుడుతో అప్రమత్తమైన ఐదుగురు ఎన్‌ఐఏ అధికారులు మంగళూరు చేరుకుని, ఆదివారం ఉదయం నుంచి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో కుక్కర్‌తోపాటు బ్యాటరీ, టైమర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షారిక్‌తో సంబంధాలున్న అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు గాలిస్తున్నారు.

మైసూరు, శివమొగ్గతోపాటు వివిధ ప్రాంతాల్లోని వారి బంధువుల నివాసాలపై ఆరా తీస్తున్నారు. రైల్వే ఉద్యోగి ప్రేమరాజ్‌ హుటగి పోగొట్టుకున్న ఆధార్‌ కార్డుతో షారిక్‌ నకిలీ ఆధార్‌ కార్డులు రూపొందించి మైసూరులో పది మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేశాడు. కాగా.. షారిక్‌ వద్ద లభించిన ఆధార్‌ కార్డుల్లో ఒకటి తమిళనాడు చిరునామా, మరొకటి హుబ్బళ్లి చిరునామాతో ఉన్నాయి. ఇతని వెనుక ఎవరున్నారనే కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపడుతోంది. బాంబు పేలుడు వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండవచ్చని డీజీపీ ప్రవీణ్‌సూద్‌ పేర్కొన్నారు. బాంబు పేలుడు ఘటనపై సీఎం బొమ్మై స్పందిస్తూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందన్నారు. ఉగ్రవాద చర్యగా ప్రాథమికంగా తేలిందని.. ఎన్‌ఐఏ, ఐబీ రంగంలోకి దిగాయన్నారు.

Updated Date - 2022-11-21T03:52:09+05:30 IST