Cong presidential poll: 96 శాతం పోలింగ్
ABN , First Publish Date - 2022-10-18T00:46:28+05:30 IST
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సోమవారం భారీగా పోలింగ్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సోమవారం భారీగా పోలింగ్ జరిగింది. 96 శాతం పోలింగ్ నమోదైంది (turnout). ఓటింగ్‌కు అర్హులైన 9,915 మందిలో 9,500 మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 22 ఏళ్ల తర్వాత గాంధీయేతర అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ భారీగా పోలింగ్ నమోదు కావడం విశేషం.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం మీడియాతో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ మాట్లాడుతూ, ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం ఓట్లలో 95.78 శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారంనాడు కౌంటింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాని, ఫిర్యాదులు కానీ చోటుచేసుకోలేదని చెప్పారు. రెండేళ్ల క్రితమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి గత ఆరు నెలల్లో వేగవంతం చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించామన్నారు. అంతర్గత ప్రజాస్వామ్య కలిగిన పార్టీగా కాంగ్రెస్ మరోసారి రుజువు చేసుకుందని చెప్పారు. ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్‌ను చూసి నేర్చుకోవచ్చని అన్నారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించామని, రాహుల్ సహా 50 మంది బళ్లారిలో ఏర్పాటు చేసిన భారత్ జోడో యాత్రా శిబిరంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారని చెప్పారు.
సీడబ్ల్యూసీ ఎన్నికలపై...
సీడబ్ల్యూసీ ఎన్నికలపై మధుసూదన్ మిస్త్రీని అడిగినప్పుడు, ఏఐసీసీ మెంబర్లను ఎన్నుకున్న తర్వాత కొత్త అధ్యక్షుడు ప్లీనరీ సమావేశానికి పిలుపునిస్తారని, సీడబ్యూసీ ఎన్నికలు, సీఈఏ మెంబర్లపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.