Congress presidential elections: ఎవరు గెలిచినా ప్రధాని అభ్యర్ధి ఆయనే!

ABN , First Publish Date - 2022-10-13T00:25:16+05:30 IST

ప్రధాని అభ్యర్ధిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు.

Congress presidential elections: ఎవరు గెలిచినా ప్రధాని అభ్యర్ధి ఆయనే!

భోపాల్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్ధిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. భోపాల్‌లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన్ను విలేకరులు ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ అవుతారా లేక ఖర్గే అవుతారా అని ప్రశ్నించారు. దీనికి ఖర్గే బదులిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాతే తేలుతుందన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యాక ఆ సంగతి చూస్తామన్నారు. 





కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 17న జరుగుతాయి. దాదాపు 9,000 మంది కాంగ్రెస్ డెలిగేట్లు ఓటు వేసేందుకు అర్హులు. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


సోనియా కుటుంబం ఉన్నవారే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారని, ఖర్గేకే సోనియా కుటుంబం ఆశీస్సులున్నాయని పరిశీలకులంటున్నారు. దళిత వర్గానికి చెందిన ఖర్గే వయసు 80 సంవత్సరాలు. 50 ఏళ్ళకు పైబడిన రాజకీయ అనుభవం ఉంది. ఆయన తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సామాన్య స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకూ ఎదిగారు. 2014 నుంచి 2019 వరకూ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా కొనసాగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభాపక్ష నేతగా ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. హిందీ భాషపై పట్టుండటం ఖర్గేకు ఉత్తరాదిన కలిసి వచ్చే అవకాశముంది. 


మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడ్తోన్న మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా దేశవ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలని 2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో శశి థరూర్ ఒకరు. దీంతో సోనియా కుటుంబం ఆశీస్సులు శశిథరూర్‌కు ఉండకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. థరూర్‌‌పై ఖర్గే విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 


కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని పరిశీలకులు చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీయే ఉండాలని ఖర్గే సహా కాంగ్రెస్ నాయకత్వమంతా ఉమ్మడిగా కోరుకుంటోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాహులే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కోరుకున్నారు. అయితే అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అన్నారు. సోనియా కుటుంబం బయటవారే ఈసారి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించాలని రాహుల్ పట్టుబట్టారు. అందుకే ఖర్గే, థరూర్ బరిలో నిలిచారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పార్టీ తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 


Updated Date - 2022-10-13T00:25:16+05:30 IST