ఆ ఇద్దరితో సోనియా గాంధీ భేటీ

ABN , First Publish Date - 2022-03-22T23:06:44+05:30 IST

కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని లేఖ రాసిన 23

ఆ ఇద్దరితో సోనియా గాంధీ భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని లేఖ రాసిన 23 మంది నేతల్లో ఇద్దరితో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తన నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల ఆమె ఈ గ్రూప్‌లోని గులాం నబీ ఆజాద్‌తో మాట్లాడిన సంగతి తెలిసిందే. 


2020 ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. పార్టీకి పూర్తి సమయాన్ని వెచ్చించగలిగే, సమర్థతగల నేత నాయకత్వం వహించాలని వీరు కోరారు. క్షేత్ర స్థాయిలో స్పష్టంగా, చురుగ్గా వ్యవహరించేవారు అవసరమని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని, పార్టీ పునరుద్ధరణపై దృష్టిపెట్టే సంస్థాగత నాయకత్వ యంత్రాంగం  అవసరమని తెలిపారు. 


మంగళవారం సోనియా గాంధీతో సమావేశమైన ఈ బృందం సభ్యుల్లో రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత ఆనంద్ శర్మ, లోక్‌సభ సభ్యుడు మనీశ్ తివారీ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరికొందరు జీ-23 నేతలతో ఆమె సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ బృందంలోని నేతలతో మాట్లాడి, వారి సలహాలను స్వీకరించేందుకు అధిష్ఠాన వర్గం సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి, అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నాయి. 


ఇదిలావుండగా, ఈ బృందం సభ్యులు మార్చి 16న స్పందిస్తూ, తాము కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమ్మిళిత, సమష్టి నాయకత్వం ఉండాలని, అన్ని స్థాయుల్లోనూ నిర్ణయీకరణ జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. 


Updated Date - 2022-03-22T23:06:44+05:30 IST