లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌లతో కాంగ్రెస్ ఎంపీల భేటీ

ABN , First Publish Date - 2022-06-16T21:09:23+05:30 IST

శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై పోలీసులు

లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌లతో కాంగ్రెస్ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని బృందం ఓం బిర్లాను కలిసింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని బృందం వెంకయ్య నాయుడును కలిసింది. 


నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ దేశవ్యా్ప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాహుల్ గాంధీ సోమ, మంగళ, బుధవారాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమక్షంలో హాజరయ్యారు. ఆయనను శుక్రవారం మరోసారి అధికారులు ప్రశ్నించనున్నారు. 


రాజ్యసభ చైర్మన్‌కు కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన లేఖలో, జూన్ 13, 14, 15 తేదీల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులతో ఢిల్లీ పోలీసులు తప్పుగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై సాధ్యమైనంత గట్టిగా నిరసనను తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. 24, అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల ఢిల్లీ పోలీసులు  ఎటువంటి హెచ్చరికలు లేకుండా, నిస్సిగ్గుగా అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ చర్యలు చేపట్టారని తెలిపారు.  జూన్ 15న ఢిల్లీ పోలీసులు తమ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి, ఎంపీలు, పాత్రికేయులు, కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు మద్దతుగా ఓ వీడియో ఫుటేజ్‌‌ను సమర్పించారు. కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, శక్తిసింహ్ గోహిల్, ప్రమోద్ తివారీ, జెబి మాథెర్‌లు పోలీసుల దాడిలో గాయపడ్డారని, వారికి వైద్య చికిత్స అవసరమని తెలిపారు. 


తమ పార్టీ ఎంపీలను వేర్వేరు పోలీస్ స్టేషన్లలో దాదాపు 10 గంటలపాటు నిర్బంధించారని తెలిపారు. ఎటువంటి వివరణ లేకుండా ఈ విధంగా నిర్బంధించడం ఎంపీల ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఓం బిర్లాను కలిసిన తర్వాత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, తాము ఎదుర్కొన్న హింసాత్మక సంఘటనలను పూర్తిగా వివరించామని చెప్పారు. స్పీకర్ తమ మాటలను చాలా సహనంతో విన్నారని తెలిపారు. తమ పార్టీ ఎంపీలపై ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేశామన్నారు. తమ పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు గాయపడ్డారని చెప్పారు. పోలీస్ స్టేషన్లలో కూడా తమ ఎంపీలపై పోలీసులు తప్పుగా ప్రవర్తించారని తెలిపారు. వారిని ఉగ్రవాదులుగా పరిగణించారని ఆరోపించారు. 


Updated Date - 2022-06-16T21:09:23+05:30 IST