Jairam Ramesh: ఉపరాష్ట్రపతి వెంకయ్యపై జైరాం రమేష్ భావోద్వేగ ట్వీట్.. ఏమని ట్వీట్ చేశారంటే..
ABN , First Publish Date - 2022-07-17T05:08:22+05:30 IST
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో వెంకయ్య నాయుడికి..

న్యూఢిల్లీ: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో వెంకయ్య నాయుడికి వీడ్కోలు తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా చేసిన సేవలకు తెర పడే సమయం వచ్చిందని.. ఆయన ఛమత్కారాన్ని, మంచి ఛలోక్తులతో ఆయన సభలో సభ్యులకు పంచే వినోదాన్ని మిస్ అవుతున్నామని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. చాలా సందర్భాల్లో విపక్ష సభ్యుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆయనలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఉన్నారని.. ఆయన రిటైర్ అవుతుండొచ్చు గానీ ఆయన విశ్రమించరన్న విషయం తనకు తెలుసని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న వెంకయ్య నాయుడి పదవీ కాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది. వెంకయ్య నాయుడు రాజ్యసభలో సభ్యులతో ఎంత సరదగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయానుకూలంగా ఆయన విసిరే ఛలోక్తులు సభలో సభ్యుల ముఖాల్లో నవ్వులపువ్వుల పూయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఎన్డీయే ఉపరాష్ట్రతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ పేరును బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరిగిన అనంతరం ఆయన పేరును నడ్డా వెల్లడించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్షా, రాజ్నాథ్, గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరపున బరిలో నిలిచిన జగదీప్ ధన్కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. బుధవారం నాడు బీజేపీ కీలన నేత అమిత్ షాతో ధన్కర్ భేటీ అయ్యారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ధన్కర్ పేరును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించడం గమనార్హం.