పాట పాడుతుండగా గుండెపోటు

ABN , First Publish Date - 2022-10-05T10:17:14+05:30 IST

దుర్గా పూజ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడిసా గాయకుడు మురళీ మహాపాత్ర పాటపాడుతుండగా గుండెపోటు రావడంతో వేదిక మీదే కుప్పకూలి మరణించారు.

పాట పాడుతుండగా గుండెపోటు

వేదిక మీదే కుప్పకూలిన మురళీ మహాపాత్ర

ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సంతాపం


కోరాపుట్‌, అక్టోబరు 4: దుర్గా పూజ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడిసా గాయకుడు మురళీ మహాపాత్ర పాటపాడుతుండగా గుండెపోటు రావడంతో వేదిక మీదే కుప్పకూలి మరణించారు. ఒడిసాలోని కోరాపుట్‌ జల్లా జైపూర్‌ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేజీమీద నాలుగు పాటలు పాడిన అనంతరం మహాపాత్ర ఉన్నట్టుండి కుర్చీలో కూలబడిపోయారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. మహాపాత్ర మృతిపట్ల ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తం చేశారు. ‘మహాపాత్ర మరణం గురించి తెలిసి చాలా బాధేసింది. ఆయన మధురమైన గాత్రంతో శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.


వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పట్నాయక్‌ ట్వీట్‌ చేశారు. మహాపాత్ర జైపూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఆఫీ్‌సలో పనిచేస్తున్నారు. మరో తొమ్మిది నెలల్లో ఆయన రిటైర్మెంట్‌ తీసుకోవాల్సి ఉంది. ఒడిసా దిగ్గజ గాయకుడు, పాటల రచయిత, స్వరకర్త అక్షయ్‌ మొహంతి శైలిని మహాపాత్ర అనుకరించేవారు. దీంతో అభిమానులు ఆయనను జైపూర్‌ అక్షయ్‌ మొహంతి అని పిలుచుకునేవారు.

Read more