Chief Minister: ఢిల్లీలో స్టాలిన్ బిజీబిజీ
ABN , First Publish Date - 2022-08-18T12:58:04+05:30 IST
ఒక్క రోజు పర్యటన కోసం హస్తిన పర్యటనకు వెళ్ళిన డీఎంకే అఽధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్(Chief Minister MK Stalin) రోజంతా బిజీబిజీగా

- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు అభినందన
అడయార్(చెన్నై), ఆగస్టు 17: ఒక్క రోజు పర్యటన కోసం హస్తిన పర్యటనకు వెళ్ళిన డీఎంకే అఽధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్(Chief Minister MK Stalin) రోజంతా బిజీబిజీగా గడిపారు. బుధవారం ఉదయం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లను కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)తో సమావేశమయ్యారు.
ఈ ఒక్కరోజు పర్యటన కోసం సీఎం మంగళవారం రాత్రి 9.10 గంటలకు చెన్నై నుంచి విమానంలో బయలుదేరివెళ్లి, తమిళనాడు హౌస్‌లో బస చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 10 గంటలకు తమిళనాడు హౌస్ నుంచి బయలుదేరి ఉపరాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఇటీవలఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌కర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత 11.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడు విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపునిచ్చేలా రూపొందించిన బిల్లును ఆమోదించాలని విఙ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయానికి చేరుకుని అక్కడ దివంగత మురసొలి మారన్ 89వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో సీఎం వెంట పార్టీ సీనియర్ నేతలతో పాటు ఎంపీలు, ప్రభుత్వ ప్రతినిధి తదితరులున్నారు.