‘కలైంజర్‌’ పేరుతో సమావేశ మందిరం

ABN , First Publish Date - 2022-07-06T13:33:41+05:30 IST

స్థానిక రాజధాని కళాశాలలో సుమారు రెండువేల మంది కూర్చునేలా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని స్మరించుకునేలా ‘కలైంజర్‌’ పేరుతో సమావేశ

‘కలైంజర్‌’ పేరుతో సమావేశ మందిరం

- రాజధాని కళాశాలలో త్వరలో నిర్మాణం

- స్నాతకోత్సవంలో ప్రకటించిన సీఎం


చెన్నై, జూలై 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక రాజధాని కళాశాలలో సుమారు రెండువేల మంది కూర్చునేలా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని స్మరించుకునేలా ‘కలైంజర్‌’ పేరుతో సమావేశ మందిరాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. మంగళవారం ఉదయం జరిగిన ఆ కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాజధాని కళాశాల అత్యంత ప్రాచీనమైనదని, మద్రాసు విశ్వవిద్యాలయం ఏర్పాటు కాకముందే 1840లోనే స్వయంప్రతిపత్తి కళాశాలగా ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా, ముఖ్యమంత్రి హోదాలో స్నాతకోత్సవంలో పాల్గొనటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. 1972 జూన్‌ 15న ఈ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థిగా చేరానని, అప్పటికే  రాజకీయ ప్రవేశం చేయడంతో చదువుపై దృష్టిసారించలేకపోయానన్నారు. ఆ తర్వాత అత్యవసర పరిస్థితిలో యేడాది పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పోలీసుల భద్రత మధ్య ఈ కళాశాలలో పరీక్ష రాయటం మరచిపోలేని అనుభవమని సీఎం గుర్తు చేసుకున్నారు. డిగ్రీలు అందుకున్న విద్యార్థులంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారి పలువురుకి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కళాశాలకు విశిష్టమైన చరిత్ర ఉందని, ద్రావిడ ఉద్యమ సీనియర్‌ నాయకుడు సర్‌ పిట్టి త్యాగరాయశ్రేష్టి, తమిళ తాతయ్యగా పిలవబడే ప్రముఖ కవి వీవి సామినాథ అయ్యర్‌, నోబల్‌ అవార్డు గ్రహీత సర్‌ సీవీ రామన్‌, మాజీ సీఎం రాజగోపాలాచారి వంటి మహానుభావులు విద్యనభ్యసించిన కళాశాల ఇదేనని, ఈ చరిత్రను విద్యార్థులు మరచిపోకుండా కళాశాలకు ఎల్లప్పుడూ మంచి పేరు సంపాదించి పెట్టాలన్నారు. ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి లా కోర్సుతోపాటు మూడు పాఠ్యాంశాల్లో పోస్టుగ్రాడ్యుయేట్‌ కూడా చేసినట్టు తెలిపారు. తాను చదివిన రాజధాని కళాశాలకు ఏదైనా మంచి పని చేయాలని సోమవారం రాత్రి విద్యాశాఖ అధికారులతో చర్చించిన మీదట ఈ కళాశాలలో రెండు వేలమంది ఆశీనులయ్యేలా కలైంజర్‌ పేరుతో సమావేశ మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు సీఎం పేర్కొన్నారు. సమావేశ మందిర నిర్మాణానికి ఎంపీ దయానిధి మారన్‌, ఎమ్మెల్యే ఉదయనిధి తమ నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి కొంత కేటాయించాలన్నారు. ఈ స్నాతకోత్సవంలో మంత్రి సెంజి మస్తాన్‌, ఎంపీ దయానిధి మారన్‌, ఎమ్మెల్యేలు ఉదయనిధి, డి. వేలు, మోహన్‌, ఎబినేజర్‌, ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి డి.కార్తికేయన్‌, రాజధాని కళాశాల ప్రిన్సిపాల్‌ ఇరా రామన్‌ తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T13:33:41+05:30 IST