అందరికీ నాణ్యమైన విద్యే లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-14T13:17:20+05:30 IST

అందరికీ నాణ్యమైన విద్యనందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే ప్రాథమిక విద్యలో కొత్త పథకాలను అమలు చేస్తున్నామని

అందరికీ నాణ్యమైన విద్యే లక్ష్యం

- సీఎం స్టాలిన్‌ ప్రకటన  

- ‘అంకెలు అక్షరాలు’ పథకం ప్రారంభం


చెన్నై, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): అందరికీ నాణ్యమైన విద్యనందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే ప్రాథమిక విద్యలో కొత్త పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. తిరువళ్లూరు జిల్లా పుళల్‌ తాలూకా అయింజివాక్కం పంచాయతీ మాధ్యమిక పాఠశాలలో సోమవారం ఉదయం ఏర్పాటైన సభలో ఒకటి నుంచి మూడు తరగతుల విద్యార్థుల కోసం ‘అంకెలు అక్షరాలు’ (ఎన్నుమ్‌ ఎళుత్తుమ్‌) పేరుతో ప్రత్యేక పథకాన్ని, మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. ఉపాధ్యాయులకు శిక్షణా పుస్తకాలు, విద్యార్థులకు విద్యా ఉపకరణాలను, పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ... అంకెలు అక్షరాలు రెండు కళ్ళలాంటివని అవ్వయార్‌ తెలిపారని, ఆ కోవలోనే అంకెలు అక్షరాలు అనే ప్రత్యేక విద్యా పథకాన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. అందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను అందించడమే డీఎంకే ద్రావిడ తరహా పాలన ప్రధాన లక్ష్యమన్నారు. ఐదేళ్లలోపు బాలబాలికలందరూ ప్రాథమిక విద్యను సక్రమంగా నేర్చుకుంటే ఉన్నత విద్యలో రాణించగలుగుతారని చెప్పారు. 2025లోపున రాష్ట్రంలోని ఎనిమిదేళ్లలోపు బాలబాలికలందరూ తమిళం, ఆంగ్లంలలో తప్పులు లేకుండా రాయటం నేర్చుకోవాలని, అదే విధంగా అంకెలను (గణితాన్ని) సక్రమంగా నేర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘అంకెలు అక్షరాలు’ పథకాన్ని. 1 నుంచి 3 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమలు చేయనున్నామన్నారు. తమిళం, ఆంగ్లం, గణిత పాఠ్యాంశాలను విద్యార్థులకు నేర్పేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా తమిళ, ఆంగ్ల మాధ్యమాల్లో శిక్షణా పుస్తకాలు రూపొందించామని, ‘ఎన్నుమ్‌ ఎళుత్తుమ్‌’ పేరిట ప్రత్యేక మొబైల్‌ యాప్‌ కూడా ప్రారంభించామన్నారు. ఈ పాఠ్యాంశాలను చిన్నారులు సులభంగా అర్థం చేసుకునే రీతిలో రూపొందించామని, ఆటపాటలు, కథలు, నటించి చూపడం, బొమ్మలాట, హస్తకళా వస్తువులతో ఈ పాఠాలను ఉపాధ్యాయులు ఆసక్తికరంగా నేర్పించనున్నారని వివరించారు. ఈ పాఠాలకు సంబంధించిన వీడియోలు కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఇటీవల రాష్ట్రం గర్వపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ రికార్డు నెలకొల్పారని, ఇళ్ళ వద్దకే విద్య పథకంలో భాగంగా ‘రీడింగ్‌ మారథాన్‌’ పేరుతో నిర్విరామ పఠనా కార్యక్రమాన్ని ఈ నెల 1నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించారని తెలిపారు. గూగుల్‌ సంస్థ రీడ్‌ అలౌట్‌ యాప్‌ను ఉపయోగించి ప్రభుత్వపాఠశాలల విద్యార్థులు తమిళం, ఆంగ్లంలలో 200 కోట్ల పదాలను పఠించారని, 14 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 81.04 లక్షల కథలను పఠించి ప్రపంచ రికార్డు నెలకొల్పారని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ళ వద్దకే విద్య, నాన్‌ ముదల్వన్‌ (నేనే ప్రథముడిని), చిన్నారుల సాహిత్య పథకం, క్లాస్‌ రూమ్‌ యాప్‌, విద్యా టీవీ వరుసలో ఈ ‘అంకెలు అక్షరాలు’ పథకం కూడా చేరిందన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్‌ఎం నాజర్‌, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎంపీ కళానిధి వీరాస్వామి, రాష్ట్ర పాఠ్యపుస్తకాల సంస్థ అధ్యక్షుడు దిండుగల్‌ లియోని, శాసనసభ్యులు ఎస్‌.చంద్రన్‌, ఎస్‌.సుదర్శనం, ఎ.కృష్ణసామి, కె.గణపతి, జోసఫ్‌ శామువేల్‌, కేపీ శంకర్‌, దురై శంకర్‌. పాఠశాలల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కాకర్ల ఉష, పాఠశాలల విద్యాశాఖ సంచాలకులు కె.నందకుమార్‌, తిరువళ్లూరు కలెక్టర్‌ డాక్టర్‌ అల్ఫీ జాన్‌ వర్గీస్‌, ప్రాథమిక విద్యాశాఖ సంచాలకులు కె.అరివొలి తదితరులు పాల్గొన్నారు.


పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

‘అంకెలు అక్షరాలు’ పథకాన్ని ప్రారంభించేందుకు పుళల్‌కు వెళ్ళిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వడక్కరై గ్రామంలో ఆదిద్రావిడ బాలుర పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి పుళల్‌ సమీపంలోని అయింజివాక్కంలో ఏర్పాటైన సభలో ‘అంకెలు అక్షరాలు’ పథకాన్ని, ప్రత్యేక మొబైల్‌యాప్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన సచివాలయానికి తిరిగొస్తూ మార్గమధ్యలో వడక్కరైలోని ఆదిద్రావిడుల బాలుర పాఠశాలకు వెళ్ళారు. పదోతరగతి గదికి స్టాలిన్‌ వెళ్ళి విద్యార్థులతోపాటు బల్లపై కూర్చుకున్నారు. అక్కడ ఉపాధ్యాయురాలు చెబుతున్న పాఠాన్ని కాసేపు విన్నారు. ఆ తర్వాత పాఠశాల ప్రాంగణంలోని పౌష్టికాహార కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను కూడా సీఎం పరిశీలించారు.

Updated Date - 2022-06-14T13:17:20+05:30 IST