ప్రజాసేవకే సమయం చాలడం లేదు.. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోను

ABN , First Publish Date - 2022-07-03T13:57:53+05:30 IST

ఏడాదికి పైగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తనకు సమయంచాలడం లేదని, ఆ కారణంగా తమ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు, విమర్శలు

ప్రజాసేవకే సమయం చాలడం లేదు.. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోను

                              - కరూర్‌ సభలో సీఎం స్టాలిన్‌


చెన్నై, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఏడాదికి పైగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తనకు సమయంచాలడం లేదని, ఆ కారణంగా తమ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. కరూర్‌లో శనివారం ఉదయం ఏర్పాటైన సభలో ఆ జిల్లాలో రూ.28.60 కోట్ల వ్యయంతో పూర్తయిన పథకాలను ప్రారంభించి, రూ.582 కోట్లతో అమలు చేయనున్న పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సభలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద 80వేలమందికి పైగా లబ్ధిదారులకు రూ.500 కోట్ల విలువైన సహాయాలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు ఆరు నెలల వరకూ ఏమీ ఆశించరని, ప్రభుత్వ శాఖలపై అవగాహన కలిగేందుకు పాలకులకు ఆరునెలలు పట్టవచ్చుననే తలంపుతో ఉంటారని, అయితే డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ప్రజలకు సేవలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చామని చెప్పారు. ఏడాది పాలనలో ఐదేళ్లకు సరిపడా పథకాలను అమలు చేయగలిగామని, అందుకు సెంథిల్‌బాలాజి వంటి సమర్థులైన మంత్రులే కారణమని అన్నారు. సెంథిల్‌ బాలాజి విద్యుత్‌ శాఖ మంత్రిగా పదవి చేపట్టక ముందు రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థ దుస్థితిలో ఉండేదని, ప్రస్తుతం ప్రజలందరికీ నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా అవుతోందని, విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేశారని ప్రశంసించారు. తమ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను గురించి తాను పట్టించుకోనని, వారి విమర్శలకు సమాధానాలిచ్చే సమయం కూడా తనకు లేదని అన్నారు. డీఎంకే పాలన ఎలా సాగుతున్నదో తెలుసుకునేందుకు ప్రసారమాధ్యమాల ప్రతినిధులు ప్రతిపక్ష నేతలను విడిచిపెట్టి  ప్రజల వద్దకు వెళ్ళి వారి ఎదుట మైకులు ఉంచి తెలుసుకోవాలన్నారు. తాను చేపడుతున్న జిల్లాలవారీ పర్యటనల్లో ప్రజలను స్వయంగా కలుసుకుంటున్నానని, డీఎంకే పాలనలో తామంతా క్షేమంగా ఉన్నామంటూ వారు చెబుతుండటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ప్రస్తుతం కరూరు సభకు కడలిలా తరలివచ్చిన జనాన్ని చూస్తుంటే డీఎంకే పాలనలో అందరూ సుఖంగా ఉన్నారని రుజవవుతోందని అన్నారు. ఈ సభలో మంత్రులు సెంథిల్‌బాలాజి, శివశంకర్‌, కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి, కరూర్‌ మేయర్‌ వి.కవిత, శాసనసభ్యులు ఇరా మాణిక్కం, కే శివకామసుందరి, డిప్యూటీ మేయర్‌ శరవణన్‌,  కలెక్టర్‌ ప్రభుశంకర్‌, జిల్లా రెవెన్యూ అధికారి లియాఖత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T13:57:53+05:30 IST