CJI DY Chandrachud : సంస్కరణల దిశగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సంచలన నిర్ణయాలు

ABN , First Publish Date - 2022-11-18T15:13:21+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) న్యాయ పాలనలో

CJI DY Chandrachud : సంస్కరణల దిశగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సంచలన నిర్ణయాలు
CJI Justice DY Chandrachud

న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) న్యాయ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడం కోసం కృషి చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న 13 ధర్మాసనాలు ప్రతి రోజూ 10 వైవాహిక సంబంధ వివాదాలపైనా, 10 బెయిలు పిటిషన్లపైనా విచారణ జరపాలని ఆదేశించారు. శుక్రవారం జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో దీనికి సంబందించిన నిర్ణయం తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ధర్మాసనం కార్యకలాపాల ప్రారంభంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ఫుల్ కోర్ట్ సమావేశంలో తాము ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి ధర్మాసనం ప్రతి రోజూ కుటుంబ వివాదాలకు సంబంధించిన 10 ట్రాన్స్‌ఫర్ పిటిషన్లను, 10 బెయిలు పిటిషన్లను విచారణకు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బెయిలు పిటిషన్లు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవి కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పారు.

వైవాహిక వివాదాలకు సంబంధించిన కేసుల్లో పార్టీలు తమకు నచ్చిన చోటుకు విచారణను బదిలీ చేయాలని కోరుతున్నాయన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్లు సుమారు 3,000 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి ధర్మాసనం రోజుకు 10 ట్రాన్స్‌ఫర్ కేసులను చేపడితే, సుప్రీంకోర్టులోని మొత్తం 13 ధర్మాసనాలు రోజుకు 130 కేసులను, వారానికి 650 కేసులను పరిష్కరించగలుగుతాయన్నారు. ఐదు వారాలు ముగిసే సరికి, అంటే శీతాకాలం సెలవులకు ముందు, అన్ని ట్రాన్స్‌ఫర్ పిటిషన్లపై విచారణ పూర్తవుతుందన్నారు.

ప్రతి ధర్మాసనం రోజుకు 20 (ట్రాన్స్‌ఫర్ + బెయిలు) కేసులపై విచారణ జరిపిన తర్వాత ఇతర రెగ్యులర్ కేసులను చేపడుతుందన్నారు. అనుబంధ జాబితాలో చిట్టచివరి క్షణంలో నమోదు చేసే కేసుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాత్రి పొద్దుపోయే వరకు కేసు ఫైళ్ళను తప్పనిసరిగా చూడవలసిన పరిస్థితిని న్యాయమూర్తులు ఎదుర్కొనకూడదని, వారిపై అటువంటి భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-11-18T15:13:26+05:30 IST