More Babies: ఎక్కువమంది పిల్లల్ని కనండి... గొప్ప లాభాలు పొందండి...
ABN , First Publish Date - 2022-08-16T23:35:18+05:30 IST
జననాల రేటు (Birth Rate) తగ్గిపోతుండటంతో చైనా (China) ప్రభుత్వం అప్రమత్తమైంది

బీజింగ్ : జననాల రేటు (Birth Rate) తగ్గిపోతుండటంతో చైనా (China) ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2025నాటికి జనాభా తగ్గిపోవడం ప్రారంభమవుతుందని హెచ్చరికలు రావడంతో జనాభాను పెంచేందుకు చర్యలను ప్రారంభించింది.
ప్రపంచంలో అత్యధిక జనాభాగల చైనా కొన్ని దశాబ్దాల నుంచి జనాభా సంక్షోభాన్ని (Population Crisis) ఎదుర్కొంటోంది. వృద్ధ ఉద్యోగవర్గం (workforce) వేగంగా పెరుగుతోంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోంది, జనాభా వృద్ధి చాలా తక్కువగా ఉంది.
‘ఒకే బిడ్డ’ నిబంధన (One Child Rule)ను 2016లో చైనా ఉపసంహరించింది. దంపతులు ముగ్గురు పిల్లల్ని కనేందుకు గత ఏడాది అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ గత ఐదేళ్ళలో జననాల రేటు తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ కమిషన్ (National Health Commission) మంగళవారం విధానపరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రత్యుత్పాదక ఆరోగ్యం, బాలల సంరక్షణ సేవల మెరుగుదలకు వ్యయాన్ని దేశవ్యాప్తంగా పెంచాలని సెంట్రల్, ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. యువ కుటుంబాలకు మద్దతుగా నిలవాలని తెలిపింది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలిపింది. రాయితీలు, పన్ను రిబేట్లు, మెరుగైన ఆరోగ్య బీమా, విద్య, గృహ నిర్మాణం, ఉద్యోగాలు వంటివాటిలో రాయితీలను కల్పించాలని సిఫారసు చేసింది.
చైనాలో బాలల సంరక్షణ సేవల కొరత ఉందని, ఈ ఏడాది చివరికల్లా నర్సరీలను పెంచాలని తెలిపింది. రెండు నుంచి మూడేళ్ల పిల్లలను సంరక్షించేందుకు నర్సరీలను అన్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. సంపన్న నగరాలు నగదు ప్రోత్సాహకాలతోపాటు విద్య, గృహ నిర్మాణం, పన్ను రాయితీలు వంటివాటిని అందిస్తున్నాయని, ఈ చర్యలను అన్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అమలు చేయాలని తెలిపింది.
చైనాలో గత సంవత్సరం 1000 మంది ప్రజలకు జననాల రేటు 7.52కు తగ్గిపోయింది. జననాలను నమోదు చేయడం ప్రారంభమైనప్పటి నుంచి (1949 నుంచి) ఇదే అతి తక్కువ జననాల రేటు.