Chief Minister: బీఎఫ్7 వైరస్ పై అప్రమత్తం
ABN , First Publish Date - 2022-12-23T10:13:21+05:30 IST
కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘బీఎఫ్7’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని కట్టుదిట్టం
- తక్షణం చర్యలు చేపట్టండి
- విదేశీ ప్రయాణికులపై నిఘా
- అధికారులకు సీఎం ఆదేశం
- ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చ
చెన్నై, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘బీఎఫ్7’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని కట్టుదిట్టం చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) గురువారం సచివాలయంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఎఫ్7 ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఆదేశించారు. ఈ కొత్త వైర్‌సకు సంబంధించి దేశంలో ఇప్పటికే మూడు కేసులు నమోదుకాగా, కేంద్ర ఆరోగ్యశాఖ బీఎఫ్7 నిరోధానికి గతంలా కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాస్కు ధారణ నిర్బంధం చేయాలని సూచించింది. గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఎవరూ మృతి చెందలేదు. అయితే పదిరోజులుగా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం మందగించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు గతంలా కరోనా వైద్యపరీక్షలు జరపాలని బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అదే సమయంలో ఈ కొత్త వైరస్ నిరోధానికి చర్యలు చేపట్టే నిమిత్తం సచివాలయంలో అధికారులతో ఆయన సమావేశమై చర్చలు జరిపారు. కేంద్రప్రభుత్వం సూచించినట్లు రాష్ట్రంలో వైరస్ నిరోధానికి ఏయే నిబంధనలు అమలు చేయాలన్న విషయంపై ఆయన సమగ్రంగా చర్చించారు. చైనా తదితర దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులందరికీ కరోనా వైద్యపరీక్షలు తప్పనిసరి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. చైనా, జపాన్, అమెరికా నుంచి వచ్చే ప్రయాణికుల్లో జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆనవాళ్లు కనిపిస్తే వారిని పరీక్షా కేంద్రాల్లో వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స కోసం వచ్చేవారిపై కూడా నిఘా వేసి జలుబు, జ్వరం, దగ్గుతో బాదపడేవారికి అవసరమైతే కరోనా వైద్యపరీక్షలు జరపాలని నిర్ణయించారు. త్వరలోనే రాష్ట్రంలో బీఎఫ్7 వేరియంట్ వ్యాప్తి నిరోధానికి అమలు చేయాల్సి నిబంధనలపై ముఖ్యమంత్రి ప్రకటన జారీ చేయనున్నారని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సెంథిల్‌కుమార్, హోంశాఖ కార్యదర్శి పణీంధర్‌రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.