చిదంబరం సార్.. ఏడుపు ఆపండి: కేజ్రీవాల్
ABN , First Publish Date - 2022-01-17T22:15:09+05:30 IST
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు..

న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దిగడం వల్ల బేజేపీయేతర ఓట్లు చీలిపోతాయంటూ కాంగ్రెస్ పార్టీ గోవా ఇన్చార్జి పి.చిదంబరం చేసిన తాజా వ్యాఖ్యలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ''ఏడవడం ఆపండి సార్. గోవా ప్రజలు ఏ పార్టీ ఆశావహంగా అనిపిస్తే ఆ పార్టీవైపే చూస్తారు'' అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
దీనికి ముందు, చిదంబరం వరుస ట్వీట్లలో గోవా ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. తన అంచనా ప్రకారం ఎన్నికల బరిలో ఉన్న ఆప్, టీఎంసీలు కేవలం బీజేపీయేతర ఓట్లనే చీల్చుకుంటాయని, గోవాలో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనేనని అన్నారు. పదేళ్ల అవకతవకల పాలన సాగించిన ప్రభుత్వాన్ని సాగనంపి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గోవా ప్రజలను ఆయన కోరారు. అవకతవకల పాలనే కొనసాగాలని కోరుకునే వారు మాత్రమే బీజేపీకి ఓటు వేయాలన్నారు.
మీ ఎమ్మెల్యేలు బీజేపీతోనే ఉన్నారు...
కాగా, చిదంబరం ట్వీట్‌పై కేజ్రీవాల్ కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలలో 15 మంది బీజేపీలోకి వెళ్లిపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రతి ఓటు సురక్షితంగా బీజేపీకే చేరుతుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.