Chidambaramపై Cbi పంజా

ABN , First Publish Date - 2022-05-18T14:02:45+05:30 IST

రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు, లోక్‌సభ సభ్యుడు కార్తీలపై సీబీఐ మరోమారు పంజా విసిరింది. చెన్నై,

Chidambaramపై Cbi పంజా

- ఏకకాలంలో తండ్రీ తనయుల నివాసాల్లో సోదాలు

- కార్తీపై మరో కొత్త కేసు


చెన్నై: రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు, లోక్‌సభ సభ్యుడు కార్తీలపై సీబీఐ మరోమారు పంజా విసిరింది. చెన్నై, ముంబాయి, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌ తదితర పదిచోట్ల వారి నివాసా లు, కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టింది. మొత్తం వందమందికిపైగా సీబీఐ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. స్థానిక నుంగంబాక్కం హాడోస్ రోడ్‌లో ఉన్న చిదంబరం నివాసం, అక్కడికి సమీపంలోనే ఉన్న కార్తీ చిదంబరం కార్యాలయం సహా మూడుచోట్ల ఢిల్లీ నుండి వచ్చిన 14 మంది సీబీఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. చిదంబరం నివాసంలో ఉన్న పనిమనుషులను విచారించారు. ఇదిలా వుండగా సోదాల సందర్భంగా కాంగ్రెస్‌ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న అనుమానంతో సీబీఐ అధికారులు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిదంబరం నివాసం నుంచి బయటకు ఎవ్వరినీ అనుమతించలేదు. సీబీఐ సోదాల గురించి తెలియగానే భారీగానే మీడియా ప్రతినిధులు హాడోస్‌ రోడ్డులో  గుమిగూడారు.


అప్పుడూ... ఇప్పుడూ..

చిదంబరం తనయుడు కార్తీపై దాఖలైన కొత్త అవినీతి కేసు విచారణలో భాగంగా సోదాలు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో పి.చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనయుడు కార్తీచిదంబరం తండ్రి పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా నగదు బట్వాడాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు మారిషష్‌ నుంచి విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చడంలో కార్తీ కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (ఈడీ) ఆరోపించాయి. మహిళా పారిశ్రామికవేత్త ఇంద్రాణి ముఖర్జీ నిర్వహణలోని ఐఎన్‌ఎక్స్‌ మీడియా ద్వారా సంస్థ 2007లో విదేశాల నుంచి సుమారు రూ.305 కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాలు బట్వాడా అయ్యాయి. ఈ వ్యవహారంలో విదేశీమారక నిబంధనలు ఉల్లఘించారని, పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఆదాయపు పన్నుల శాఖ జరిపిన దర్యాప్తులో ఈ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ ఆరోపణలుకు ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ, ఈడీ అధికారులు ప్రకటించారు. దీంతో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసి 2018లో ఆయనను అరెస్టు చేశారు. అదే సమయంలో చిదంబరాన్ని 2019లో అరెస్టు చేశారు. విచారణ పూర్తయిన తర్వాత న్యాయస్థానం వారిద్దరినీ విడుదల చేసింది. అయినా కార్తీపై అవినీతి కేసుపై విచారణ కొనసాగుతోంది. ఆ నేపథ్యంలో చిదంబరం, కార్తీ నివాసాలు, కార్యాలయాల్లో నాలుగుసార్లు సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా కార్తీ చిదంబరం మరిన్ని అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఆ దిశగా గత కొద్ది నెలలుగా రహస్యంగా విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో కార్తీపై సీబీఐ అధికారులు కొత్త కేసు నమోదు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన చైనా సంస్థ ఆ దేశం నుంచి కార్మికులను తరలించేందుకు ఇబ్బంది పడింది. ఆ సమయంలో విద్యుత్‌ కేంద్రం పనుల కోసం చైనా నుంచి 250 మంది కార్మికులను పంజాబ్‌కు తరలించేందుకు కార్తీ అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న తన తండ్రి అధికారాన్ని ప్రయోగించి వారికి అక్రమంగా వీసాలు మంజూలు చేయించినట్లు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ వీసాల మంజూరుకు కార్తీ రూ.50లక్షలు ముడుపులుగా స్వీకరించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగానే మంగళవారం ఉదయం ఈ సోదాలు నిర్వహించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో 2018 ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్టయ్యారు. ఆ కేసు విచారణ సమయంలో కార్తీ లండన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన కార్తీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా ఆయన లండన్‌లో వున్న సమయంలోనే సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. 


ఏవీ దొరకలేదు: చిదంబరం 

తమ నివాసాల్లో చేపట్టిన సీబీఐ తనిఖీల్లో పత్రాలేవీ లభించలేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చెన్నైలోని తన నివాసంలో, ఢిల్లీలోని తన కార్యాలయంతో కూడిన నివాసంలోను సీబీఐ అధికారులు తనిఖీలు చేశారని, ఉదయం నుంచి జరుగుతున్న ఈ తనిఖీల్లో వారికి ఏమీ లభించలేదని తెలిపారు. అదే విధంగా తనిఖీల సందర్భంగా సీబీఐ అధికారులు తనకు చూపిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో తనను నిందితుడిగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ సీబీఐ తనిఖీలు జరుగుతున్న ఈ తరుణం చాలా ఆసక్తికరమైనదని చిదంబరం వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా సీబీఐ అధికారులు తనిఖీలు చేయడంపై కార్తీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నిసార్లు తనిఖీలు చేస్తారని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. 2015లో రెండు సార్లు, 2017లో ఒకసారి, 2018లో రెండుసార్లు చొప్పున మొత్తం ఐదుసార్లు సీబీఐ అధికారులు ఇప్పటి వరకు తనిఖీ చేశారని, ప్రస్తుతం ఆరోసారి తనిఖీలు నిర్వహించారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


రాజ్యసభ అభ్యర్థిత్వంపై ప్రభావం పడేనా?

డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ కు దక్కిన ఏకైక రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు చిదంబరం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటొకిక పదవేనని ఇటీవల కాంగ్రెస్‌ తీర్మానం చేసినప్పటికీ ఆ నిబంధన చిదంబరానికి మినహాయింపునిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో రాష్ట్రం నుంచి చిదంబరం రాజ్యసభకు వెళ్లడం ఖాయమని అన్ని వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో చిదంబరం, ఆయన తనయుడు కార్తీల నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించడంతో వారి అభిమానులు నివ్వెరపోతున్నారు. ఈ వ్యవహారంపై చిదంబరాన్ని రాజ్యసభకు దూరం చేస్తుందేమోనని డీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతోంది. Read more