చికెన్ కూరలో బల్లి: నలుగురికి అస్వస్థత
ABN , First Publish Date - 2022-06-17T14:54:30+05:30 IST
ఓ హోటల్లో పరోటా కోసం అందజేసిన చికెన్ కూరలో మృతిచెందిన బల్లి పడి ఉండడాన్ని గమనించిన నలుగురు వాంతులు చేసుకొని స్పృహ తప్పారు. ఈరోడ్ అరసలూరుకు

పెరంబూర్(చెన్నై), జూన్ 16: ఓ హోటల్లో పరోటా కోసం అందజేసిన చికెన్ కూరలో మృతిచెందిన బల్లి పడి ఉండడాన్ని గమనించిన నలుగురు వాంతులు చేసుకొని స్పృహ తప్పారు. ఈరోడ్ అరసలూరుకు చెందిన దివ్యాంగుడు సెంథిల్‌కుమార్, అతడి భార్య అముద (40), బంధువులు చంద్రన్, షణ్ముగంలతో కలసి ఈరోడ్ గాంధీ విగ్రహం సమీపంలోని ఓ హోటల్లో మధ్యాహ్న భోజనం కోసం వచ్చారు. సెంథిల్‌కుమార్ కారులోనే ఉండగా, కారు డ్రైవర్ సురేష్ సహా అముద, చంద్రన్, షణ్ముగం హోటల్‌కు వెళ్లి పరోటా ఆర్డరు చేశారు. పరోటాతో పాటు అందజేసిన చికెన్ కూరలో బల్లి కళేబరం ఉండడం చూసి అముద, చంద్రన్ వాంతులు చేసుకుంటూ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో, వారితో పాటు షణ్ముగం, సురేష్ లను ఈరోడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. హోటల్‌ను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.