Chennai: టీటీడీ సలహామండలికి మరో ఏడుగురు
ABN , First Publish Date - 2022-12-24T08:11:03+05:30 IST
స్థానిక టి.నగర్ వెంకటనారాయణరోడ్డులో వున్న తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)
- 32కి చేరిన సభ్యుల సంఖ్య
చెన్నై, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక టి.నగర్ వెంకటనారాయణరోడ్డులో వున్న తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) చెన్నై సమాచారకేంద్ర సలహామండలికి మరో ఏడుగురు సభ్యులను నియమించారు. దీంతో ఇప్పటికే అధ్యక్షుడితో కలిపి 25 మంది సభ్యులున్న సలహామండలి సంఖ్య 32కు చేరింది. పొట్టి శ్రీరాములు స్మారక భవన కమిటీ అధ్యక్షుడిగా వున్న కె.అనిల్‌కుమార్‌రెడ్డి, పారిశ్రామికవేత్త డి.రాధాకృష్ణమూర్తి, వేల్స్ వర్సిటీ చైర్మన్ డాక్టర్ ఇషారి కె.గణేశ్, కె.గాయత్రిదేవి, రామనాధపురానికి చెందిన ఎస్.నాగరాజన్, చెనైకి చెందిన వి.గోకులకృష్ణన్, పారిశ్రామికవేత్త వూరా లక్ష్మీ నరసింహారావులను కమిటీ సభ్యులుగా నియమిస్తూ టీటీడీ డిప్యూటీ ఈవో సి.గుణభూషణరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అనిల్‌కుమార్‌రెడ్డి, రాధాకృష్ణమూర్తి, ఇషారి గతంలో కమిటీ సభ్యులుగా వ్యవహరించినవారే కాగా, మిగిలిన నలుగురు కొత్తవారు. ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేస్తూ అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి పంపిన జాబితాను టీటీడీ యధాతథంగా ఆమోదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సలహామండలి అధ్యక్షుడిగా ఏజే శేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా వీఎల్ వెంకటసుబ్రమణ్యం, ఎం.ప్రభాకర్‌రెడ్డి, దురైమురుగన్ కదిర్ ఆనంద్, సభ్యులుగా కె.ఆనంద్‌కుమార్ రెడ్డి, పృధ్వి జీఏ, వీఆర్ వెంకటాచలం, పీవీఆర్ కృష్ణారావు, మోహన్ పద్మనాభరావ్, ఎస్.కార్తికేయన్, జయరామన్ కేఎస్, ఇందిరా రాజేంద్రన్, స్వతంత్రం ఎస్‌ఎస్, సన్నారెడ్డి రవీంద్రబాబు, కృష్ణారెడ్డి, ఎం.అశోక్ కిషన్, వేమిరెడ్డి సందీప్‌రెడ్డి, ఎం.శ్రీశరణ్, ఎన్.కల్యాణ్ చక్రవర్తి, డాక్టర్ పి.ధీరజ్ రెడ్డి, నరేష్ సుబ్రమణి, షెన్బగమూర్తి, తాతినేని అజయ్, పన్నీర్‌సెల్వం, డాక్టర్ ఎన్.పరశురామన్ వున్న విషయం తెలిసిందే. కాగా సలహామండలిలో మరికొంతమందికి చోటు లభించే అవకాశమున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2019-2021 కాలానికి మండలి సంఖ్య 37, కానీ కొంతమంది సభ్యులు సరిగ్గా స్వామివారి కైంకర్యాలకు హాజరుకాకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడం తదితర కారణాలతో కొత్త మండలిలో సంఖ్య తగ్గించారు. అయితే పలు వత్తిళ్ల మేరకు మళ్లీ సభ్యుల సంఖ్య పెంచాలని టీటీడీ పాలకమండలి భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మరికొంతమంది కూడా జతచేరే అవకాశముందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఏడాది జనవరి 27న మండలికి సంబంధించి ఉత్తర్వులిచ్చిన టీటీడీ.. 11 నెలలకు కొత్తవారిని చేరుస్తూ ఆదేశాలివ్వడం గమనార్హం.