Pink bus: చెన్నైలో ‘పింక్ బస్’ పరిచయం
ABN , First Publish Date - 2022-08-07T13:39:52+05:30 IST
చెన్నైలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి మరో సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చింది. ఏ బస్సు

- ప్రారంభించిన ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 6: చెన్నైలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి మరో సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చింది. ఏ బస్సు ఎక్కితే ఉచితమో, ఏ బస్సులో ప్రయాణం చేస్తే చార్జీ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్న మహిళలకు మరింత అనువైన వసతి కల్పించింది. తమకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించే బస్సును మహిళలు ఠక్కున గుర్తించేందుకు అనువుగా ‘పింక్ బస్’ సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ పింక్ బస్(Pink bus) సర్వీసును శనివారం ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి(MLA Udayanidhi), హిందూ దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, రవాణాశాఖ మంత్రి శివంకర్, ఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ అన్బు అబ్రహాం తదితరులు నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. నగరంలో కూలీనాలీ, ఉద్యోగాలు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే మహిళల కోసం గతంలో ఉచిత ప్రయాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్డినరీ (వైట్ బోర్డు) బస్సుల్లో ఎక్కే మహిళలకు ఉచిత ప్రయాణం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి విశేష ఆదరణ లభించింది. చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్(Chennai Metropolitan Corporation) నడుపుతున్న 1,559 బస్సుల్లో ప్రతిరోజూ 10.50 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు అంచనా. మహిళల సౌకర్యార్థం ఆర్డినరీ బస్సులపై ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అనే స్టిక్కర్లు అందించారు. అయితే కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సు(Express bus)లను ఆర్డినరీ బస్సులుగా భావిస్తున్న మహిళలు వాటిల్లోకి ఎక్కి ఉచిత ప్రయాణం కోసం డిమాండ్ చేస్తున్నారు. అందుకే కండక్టర్ ససేమిరా అనడంతో వారి మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. దీనిని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉచిత ప్రయాణ సదుపాయం వున్న బస్సుల్ని గ్రహించగలిగేలా బస్సు ముందు, వెనుక భాగంలో పింక్ రంగును వేయాలని నిర్ణయించింది. స్థానిక చేపాక్కంలో శనివారం జరిగిన కార్యక్రమంలో తొలివిడతగా 50 ‘పింక్ బస్’ సర్వీసులను ఎమ్మెల్యే ఉదయనిధి జెండా పూపి ప్రారంభించారు. అలాగే, మెట్రో రైల్వేస్టేషన్లు అనుసంధానం చేసేలా 10 మినీ బస్సులను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.