మహిళలకు ఏ ప్రాతిపదికన వార్డులు కేటాయించారు?

ABN , First Publish Date - 2022-02-02T14:45:30+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో మహిళలకు ఏ ప్రాతిపదికన వార్డుల ను కేటాయించారో వివరాలు తెలపాలంటూ మద్రాసు హైకోర్టు ప్రథమ ధర్మాసనం కార్పొరేషన్‌కు నోటీసు జారీ చేసింది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపా

మహిళలకు ఏ ప్రాతిపదికన వార్డులు కేటాయించారు?

                         - చెన్నై కార్పొరేషన్‌కు హైకోర్టు నోటీసు


చెన్నై: గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో మహిళలకు ఏ ప్రాతిపదికన వార్డులను కేటాయించారో వివరాలు తెలపాలంటూ మద్రాసు హైకోర్టు ప్రథమ ధర్మాసనం కార్పొరేషన్‌కు నోటీసు జారీ చేసింది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు ఈ నెల 19న ఎన్నికలు జరుగనున్నాయి. 1996 రాష్ట్ర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వార్డు విభజనలు, రిజర్వేషన్ల నియమావళి ప్రకారం మహిళలకు 50 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు చేయాలని సూచిస్తోంది. 1996 నాటి నియమావళిని పట్టించుకో కుండా చెన్నై కార్పొరేషన్‌లో జోన్ల ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో మొత్తం వార్డులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు కల్పించాలని గతంలో హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. ఆ మేరకు జనవరి 17న వార్డుల రిజ ర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ మేరకు కొన్ని జోన్లలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించలేదని, కొన్ని జోన్లలో 50 శాతానికి మించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని ఆరోపిస్తూ హైకోర్టులో తాజాగా ఓ పిటిషన్‌ దాఖలైంది. ఎలాంటి గణాంకాలను ఆధారంగా తీసుకోకుండా రిజర్వేషన్లు ప్రకటించారని అందులో ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లను రద్దుచేసి, వార్డుల్లో మహిళా జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరిగేలా ఉత్తర్వు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాధ్‌ భండారీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి చెన్నై కార్పొరేషన్‌లో మహిళలకు జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారా? లేక ఓటర్ల సంఖ్యలను బట్టి రిజర్వేషన్లు ప్రకటించారా? అనే విషయమై సమగ్ర వివరాలను తమకు అందజేయాలంటూ కార్పొరేషన్‌కు నోటీసు జారీ చేశారు.

Updated Date - 2022-02-02T14:45:30+05:30 IST