Chennaiలో నిర్బంధ హెల్మెట్‌ ధారణ అమలు

ABN , First Publish Date - 2022-05-24T14:21:40+05:30 IST

నగరంలో సోమవారం నుంచి నిర్బంధ హెల్మెట్‌ ధారణ అమలులోకి వచ్చింది. హెల్మెట్‌ లేకుండా వెళ్తున్న ద్విచక్రవాహన చోదకులకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తున్నారు.

Chennaiలో నిర్బంధ హెల్మెట్‌ ధారణ అమలు

                 - పలు చోట్ల జరిమానా విధింపు


చెన్నై: నగరంలో సోమవారం నుంచి నిర్బంధ హెల్మెట్‌ ధారణ అమలులోకి వచ్చింది. హెల్మెట్‌ లేకుండా వెళ్తున్న ద్విచక్రవాహన చోదకులకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. వాహనం నడిపే వారితోపాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం కొత్త నిబంధన ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సోమవారం నుంచి అది అమలులోకి వచ్చింది. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే వెనుక ఉన్న వారికి కూడా రూ.700 చొప్పున జరిమానా విధించారు. నగరమంతా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులతో నిఘా ఏర్పాటైంది. సుమారు మూడు వందల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ద్విచక్రవాహనాలపై వెళుతున్నవారిపైనే దృష్టిసారించారు. ద్విచక్రవాహనాల్లో హెల్మెట్‌ ధరించనివారే అధికంగా మృతి చెందుతున్నారని గత 15 నెలలుగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కారణంగానే నగరంలో ద్విచక్రవాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని, వారితోపాటు వెనుక కూర్చున్న వారికి కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పోలీసులు స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో నగరంలో సోమవారం ఉదయం 9 గంటల నుండే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ పోలీసులు నిఘా వేశారు. నగరంలోని రాయపేట, ట్రిప్లికేన్‌, అన్నాసాలై, మెరీనాబీచ్‌ రోడ్డు, మైలాపూరు, కోడంబాక్కం, టి.నగర్‌, రాయపురం, నుంగంబాక్కం, వేళచ్చేరి, తిరువాన్మియూరు, అడయార్‌, తాంబరం, ఆవడి, అంబత్తూరు తదితర ప్రధాన రహదారుల ట్రాఫిక్‌సిగ్నల్‌ వద్ద స్వైపింగ్‌ యంత్రాలను పట్టుకుని హెల్మెట్‌లేనివారికి జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. అన్నానగర్‌ ఆర్చ్‌ వద్ద తొలిరోజే హెల్మెట్లు లేకుండా వెళ్తున్న సుమారు వందమందికి పైగా పట్టుబడ్డారు. వీరందరికి స్పాట్‌ఫైన్‌గా రూ.500 నుంచి రూ.700 వరకూ విధించారు. ఈ విషయమై ట్రాఫిక్‌ విభాగం పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నగరంలో నిర్బంధ హెల్మెట్‌ ధారణ అమలు చేయనున్నట్లు వారం రోజులుగా నగరమంతటా అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని, ఆదివారం పలు ప్రాంతాల్లో కరపత్రాలను కూడా పంపిణీ చేసామని తెలిపారు. అయినా సోమవారం ప లు ప్రాంతాల్లో హెల్మెట్లు లేకుండా వెళ్తున్న ద్విచక్రవాహనచోదకులు అధికంగా కనిపించారన్నారు. వాహనచోధకులు జరిమానా చెల్లించడం కన్నా హెల్మెట్లు కొనుక్కోవడమే మంచిదని సూచించారు. హెల్మెట్లు ధరించకుండా రెండుమూడుసార్లు పట్టుబడితే కేసు నమోదవుతుందని కూడా ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-05-24T14:21:40+05:30 IST