అరవై రోజుల్లో Char Dham యాత్రలో 201 మంది యాత్రికుల మృతి

ABN , First Publish Date - 2022-06-27T14:01:38+05:30 IST

ఈ ఏడాది చార్‌థామ్ యాత్రలో కేవలం 60 రోజుల్లో 201 మంది యాత్రికులు మరణించారు....

అరవై రోజుల్లో Char Dham యాత్రలో 201 మంది యాత్రికుల మృతి

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): ఈ ఏడాది చార్‌థామ్ యాత్రలో కేవలం 60 రోజుల్లో 201 మంది యాత్రికులు మరణించారు.రుతుపవనాల ఆగమనంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో హెలికాప్టరు సర్వీసులను నిలిపివేయడంతోపాటు యాత్రికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల యాత్రికులు కాలినడకన చార్‌థామ్ యాత్రను సజావుగా నిర్వహించడంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.చార్‌థామ్ మే 3వతేదీన ప్రారంభమై అక్టోబర్ చివరి భాగంలో ముగియనుంది. ఇప్పటివరకు తీర్థయాత్రకు వచ్చిన యాత్రికుల సంఖ్య 2,50,000 దాటింది. 


భారీవర్షాలతో వారంరోజుల నుంచి యాత్రికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో 95 మంది, బద్రీనాథ్ ధామ్‌లో 51 మంది, గంగోత్రిలో 13 మంది, యమునోత్రిలో 42 మంది యాత్రికులు మరణించారని డెహ్రాడూన్‌లోని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం తెలిపింది. చార్‌థామ్ యాత్ర మార్గంలోని 9 ప్రాంతాల్లో మొదటిసారి యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతోపాటు కరపత్రాల ద్వారా ఆరోగ్య సలహాలు ఇస్తున్నామని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ శైలజా భట్ చెప్పారు.యాత్రికులకు ముఖ్యంగా వృద్ధులకు యాత్రలో జరిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.చార్ ధామ్ మార్గాల్లో 12 మంది వైద్యులను నియమించినట్లు ఆమె తెలిపారు.


‘‘అనారోగ్యానికి గురయ్యే యాత్రికులకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో చికిత్స కోసం హెలి-అంబులెన్స్ ద్వారా ఉన్నత వైద్య కేంద్రాలకు తరలిస్తున్నాం. ఇప్పటివరకు మరణానికి ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులే. హృద్రోగ యాత్రికులు ఇకపై ప్రయాణం చేయవద్దని చెపుతున్నాం’’అని శైలజా చెప్పారు.యాత్ర మార్గాల్లో 20 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

కేదార్ నాథ్  మృతుల సంఖ్య 95

బద్రీనాథ్ మృతుల సంఖ్య     51

యమునోత్రి మృతుల సంఖ్య  42

గంగోత్రి మృతుల సంఖ్య        13

Updated Date - 2022-06-27T14:01:38+05:30 IST