Bangalore: చామరాజపేట ఈద్గా మైదానంలో యథాస్థితి

ABN , First Publish Date - 2022-08-31T18:09:34+05:30 IST

బెంగళూరు చామరాజపేట ఈద్గా మైదానంలో యథాస్థితిని కాపాడాలని సుప్రీంకోర్టు(Supreme Court) త్రిసభ్య ధర్మాసనం మంగళవారం

Bangalore: చామరాజపేట ఈద్గా మైదానంలో యథాస్థితి

                                             - సుప్రీంకోర్టు ఉత్తర్వులు 


బెంగళూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు చామరాజపేట ఈద్గా మైదానంలో యథాస్థితిని కాపాడాలని సుప్రీంకోర్టు(Supreme Court) త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. ఈద్గా మైదానాన్ని రాష్ట్ర రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకున్న అనంతరం పలు సంఘాలు గణేశ ఉత్సవాల(Ganesha Festivals) నిర్వహణకు అ నుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ అంశంపై పూర్వాపరాల్లోకి వెళితే.. హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా ఏకసభ్య ధర్మాసనం యథాస్థితిని కాపాడాలని తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం సవాల్‌ చేయడంతో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం శాంతిభద్రతలను కాపాడుతూ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది. దీన్ని సవాల్‌ చేస్తూ కొన్ని ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాయి. తొలుత దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్‌ హేమంత్‌ గుప్త, జస్టిస్‌ సుధాంశు ధరియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. చివరకు సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లలిత్‌ ఈ అంశాన్ని తేల్చే బాధ్యతను న్యాయమూర్తులు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి అప్పగించారు. సుదీర్ఘ వాదనల అనంతరం చామరాజపేట ఈద్గా మైదానంలో రెండు రోజులపాటు యథాస్థితిని కాపాడాలంటూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు పాఠాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి బొమ్మై(Chief Minister Bommai) ప్రకటించారు. కాగా చామరాజపేట ప్రాంతంలో ముందస్తు చర్యల్లో భాగంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. ఈ బృందం మార్చ్‌ఫ్లాగ్‌ నిర్వహించింది. అశాంతి సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈద్గా మైదానంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరింపచేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రతా్‌పరెడ్డి మీడియాకు తెలిపారు. 

Updated Date - 2022-08-31T18:09:34+05:30 IST