ఆకార్ పటేల్‌ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి : సీబీఐ

ABN , First Publish Date - 2022-04-12T19:04:25+05:30 IST

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) నిబంధనల ఉల్లంఘన

ఆకార్ పటేల్‌ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి : సీబీఐ

న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) నిబంధనల ఉల్లంఘన కేసులో అమ్నెస్టీ ఇండియా మాజీ చీఫ్ ఆకార్ పటేల్‌పై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఢిల్లీ సెషన్స్ కోర్టుకు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చెప్పింది. దీనికి సంబంధించిన లేఖను సీబీఐ సోమవారం సాయంత్రం రౌజ్ అవెన్యూలోని కోర్టుకు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


ఆకార్ పటేల్ ఇటీవల అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించినపుడు దర్యాప్తు అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అడ్డుకున్న సంగతి తెలిసిందే. అమ్నెస్టీ ఇండియా, ఆకార్ పటేల్ ఎఫ్‌సీఆర్ఏ, 2010 నిబంధనలను ఉల్లంఘించినట్లు సీబీఐ 2021 డిసెంబరు 31న ఛార్జిషీటును దాఖలు చేసింది. దీనికి అనుగుణంగా చట్టపరంగా విచారణ జరిపి, చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో స్పెషల్ కోర్టు విచారణను చేపట్టడానికి అవకాశం ఏర్పడింది. 


ఎఫ్‌సీఆర్ఏ ప్రకారం దాఖలు చేసే కేసులను ఏదైనా కోర్టు విచారణకు చేపట్టాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారం పొందిన అధికారి కానీ అనుమతిని మంజూరు చేయవలసి ఉంటుందని ఈ చట్టంలోని సెక్షన్ 40 చెప్తోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమైంది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఈ అనుమతి రావడంతో ఈ కేసులో విచారణ జరిపేందుకు స్పెషల్ కోర్టుకు అవకాశం లభించింది. 


అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఆకార్ పటేల్‌లపై సీబీఐ రెండేళ్ళపాటు దర్యాప్తు జరిపింది. ఎఫ్‌సీఆర్ఏ చట్టంలోని సెక్షన్లు 35, 39లను చదువుతూ, సెక్షన్ 11 ప్రకారం ఛార్జిషీటును దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూలో ఉన్న స్పెషల్ సీబీఐ కోర్టులో 2021 డిసెంబరు 31న ఈ ఛార్జిషీటును దాఖలు చేసింది. దీనిపై కోర్టు ఏప్రిల్ 18న విచారణ ప్రారంభిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


ఈ ఛార్జిషీటును దాఖలు చేసిన తర్వాత సీబీఐ ఆకార్ పటేల్‌పై లుకౌట్ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీని ఆధారంగానే ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అడ్డుకుంది. ఆయన అమెరికా వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా నిలువరించింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళవద్దని ఆకార్ పటేల్‌ను గత శుక్రవారం స్పెషల్ జడ్జి ఆదేశించారు. 


అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్స్ ఫర్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సౌత్ ఆసియా ఫౌండేషన్, తదితర సంస్థలపై 2019 నవంబరులో కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా బ్రిటన్ నుంచి విరాళాలను తీసుకున్నందుకు ఈ కేసు నమోదైంది. 


దీనిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా స్పందిస్తూ, భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రతిసారీ తమను వేధిస్తున్నారని ఆరోపించింది. 


Updated Date - 2022-04-12T19:04:25+05:30 IST