సిసోడియాకు సీబీఐ సమన్లు

ABN , First Publish Date - 2022-10-17T08:42:48+05:30 IST

సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సిసోడియాకు సీబీఐ సమన్లు

  • నేడు విచారణకు హాజరవ్వాలంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి తాఖీదు
  • సిసోడియాను అరెస్ట్‌ చేసేందుకే..!
  • సీబీఐ చర్యలపై ‘ఆప్‌’ ఆందోళన
  • సిసోడియా, సత్యేందర్‌ జైన్‌లను భగత్‌ సింగ్‌తో పోల్చిన కేజ్రీవాల్‌
  • ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇప్పటికే బోయినపల్లి అభిషేక్‌, ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌ అరెస్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 16: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీఐబీ హెడ్‌క్వార్టర్స్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మద్యం విధానం రూపకల్పనలో అవినీతి జరిగిందంటూ సిసోడియా, మరో 14 మందిపై సీబీఐ ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ‘సీబీఐ నా ఇంట్లో 14 గంటల పాటు తనిఖీలు నిర్వహించింది. వారికి ఏం దొరకలేదు. నా బ్యాంక్‌ లాకర్‌లోనూ వెతికింది. అయినా వారికి ఏం లభించలేదు. ఇప్పుడు  సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరై పూర్తి సహకరిస్తాను. సత్యమేవ జయతే’ అని సిసోడియా ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సీరియ్‌సగా స్పందించారు. సిసోడియాతో పాటు కొన్నాళ్ల కిందట ఈడీ అరెస్ట్‌ చేసిన మంత్రి సత్యేందర్‌ జైన్‌ను భగత్‌ సింగ్‌తో పోల్చారు. 


కేంద్రంతో తమ ప్రభుత్వ యుద్ధాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించారు. ‘జైలు కటకటాలు, ఉరికంబం భగత్‌ సింగ్‌ సంకల్పాన్ని ఆపలేకపోయాయి. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. మనీశ్‌, సత్యేందర్‌లు నేటి భగత్‌ సింగ్‌లు. 75 ఏళ్ల తర్వాత దేశానికి ఓ మంచి విద్యా మంత్రి లభించారు.  కోట్లాది మంది పేదల  ప్రార్థనలు మీకు అండగా ఉంటాయి’ అని కేజ్రీవాల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. సిసోడియాను అరెస్టు చేయడానికే సీబీఐ సమన్లు ఇచ్చిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీబీఐ ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆప్‌ ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. తెలంగాణకు చెందిన ప్రముఖుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఢిల్లీ లిక్కర్‌ స్కాం సంచలనంగా మారింది. సీబీఐ ఇప్పటికే ఆప్‌ నాయకుడు విజయ్‌ నాయర్‌, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్ట్‌ చేసింది. ఇంకా పలువుర్ని ప్రశ్నించింది. వారిలో ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు, గురుగ్రామ్‌లోని బడ్డీ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అమిత్‌ అరోరా, ‘ఇండియా ఎహెడ్‌ న్యూస్‌’ ఎండీ ముత్తా గౌతమ్‌ ఉన్నారు.


 గత ఏడాది కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా సిఫారసు చేయడంతో కథ మొదలైంది. ఆగస్టులో సీబీఐ ఢిల్లీలోని స్పెషల్‌ కోర్టులో సిసోడియా సహా 15 మందిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. అనంతరం సిసోడియా నివాసంలో సోదాలు నిర్వహించింది.  సిసోడియా సన్నిహితులకు మద్యం వ్యాపారి అయిన మహేంద్రు నుంచి కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని పేర్కొంది. తెలంగాణకు చెందిన ఓ మద్యం వ్యాపారి లాబీకి కూడా ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ అక్రమాల్లో ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. అరెస్టయిన బోయినపల్లి అభిషేక్‌... సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొన్న అరుణ్‌ పిళ్లైకు వ్యాపార భాగస్వామి. తాజాగా సిసోడియాకు సమన్లతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్టయింది. 

Updated Date - 2022-10-17T08:42:48+05:30 IST