Delhi Liquor Scam: సిసోడియా సవాల్‌ను స్వీకరించిన సీబీఐ?

ABN , First Publish Date - 2022-09-16T16:12:40+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించినదంటూ బీజేపీ బయటపెట్టిన

Delhi Liquor Scam: సిసోడియా సవాల్‌ను స్వీకరించిన సీబీఐ?

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించినదంటూ బీజేపీ బయటపెట్టిన స్టింగ్ ఆపరేషన్ వీడియోపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన సవాలును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)  స్వీకరించినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. సీబీఐ ఈ వీడియోను పరిగణనలోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. 


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానం (Delhi Excise Policy)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కుంభకోణానికి సంబంధించినదంటూ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపీ విడుదల చేసింది. బీజేపీ నేత అమిత్ అరోరా (Amit Arora) గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎక్సయిజ్ విధానంలో అవినీతి జరిగిందని చెప్పారు. దీనిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో, ఈ కేసులో ఓ నిందితుడు స్టింగ్ ఆపరేషన్‌లో అసలు వాస్తవాలు బయటపెట్టినట్లు తెలిపారు.  ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం  ఉద్దేశపూర్వకంగానే చిన్న వ్యాపారులను ఈ విధానంలోకి రాకుండా చేసిందని ఈ నిందితుడు చెప్పినట్లు తెలిపారు. కోరుకున్నట్లుగా రూపొందించిన ఈ ఎక్సయిజ్ పాలసీని కొందరు వ్యక్తులు మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాధించేందుకు వీలుగా రూపొందించారని చెప్పారని తెలిపారు. 


ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా గురువారం ఘాటుగా స్పందించారు. బీజేపీ ఈ స్టింగ్ వీడియోను సీబీఐకి ఇవ్వాలని సవాల్ చేశారు. బీజేపీ అనుబంధ విభాగమే సీబీఐ అని పేర్కొన్నారు. సీబీఐ తన ఇంట్లో, లాకర్లో తనిఖీలు చేసిందని, అయినా ఏమీ దొరకలేదని చెప్పారు. ఈ వీడియోపై సీబీఐ దర్యాప్తు జరపాలని, నిజమని తేలితే తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లోగా ఈ విషయాన్ని రుజువు చేయకపోతే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు సోమవారం (సెప్టెంబరు 19)న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పీఎంఓ (ప్రధాన మంత్రి కార్యాలయం) ఈ స్టింగ్ ఆపరేషన్ చేయించిందని అంగీకరించాలని అన్నారు. 


Updated Date - 2022-09-16T16:12:40+05:30 IST