గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2022-01-26T22:42:34+05:30 IST

కాపీరైట్ ఉల్లంఘన కేసు కింద గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యూట్యూబ్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై..

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ఎఫ్ఐఆర్

న్యూఢిల్లీ: కాపీరైట్ ఉల్లంఘన కేసు కింద గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యూట్యూబ్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సునీల్ దర్శన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ విషయాన్ని సునీల్ దర్శన్ మీడియాకు తెలియజేశారు.


''ఈ కేసు ముఖ్యంగా 2017లో నేను విడుదల చేసిన 'ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా' చిత్రానికి సంబంధించినది. సినిమాలకే సంబంధించి మరో కేసు కూడా గతంలో ఉంది. ఏక్ హసీనా...చిత్రానికి బిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా వాళ్లకు తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. టెక్నాలజీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, నా హక్కులను పూర్తిగా కాలరాశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా వారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడమనేది మొదటి అడుగు. న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు'' అని సునీల్ దర్శన్ తెలిపారు. తనకు ఎలాంటి ప్రచారం అవసరం లేదని, అయితే వాస్తవాలను రికార్డు చేయడమే తన ప్రధాన ఉద్దేశం కానీ మరొకటి కాదని చెప్పారు. ఫిల్మ్‌మేకర్‌గా, కాపీరైట్ ఓనర్‌గా తనకు కొన్ని హక్కులుంటాయని, దానిని నిర్దయగా ఎవరైనా  ఉల్లంఘిస్తే చేసేదేముంటుందని ప్రశ్నించారు.


కాగా, ఈ కేసులో జనవరి 25న ఎంఐడీసీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు సాగిస్తున్నారు. 1957 కాపీరైట్ చట్టంలోని 51,63,69 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సునీల్ దర్శన్ గతంలో 'జాన్‌వర్', 'ఏక్ రిస్థా', 'అందాజ్', 'ఏక్ హసీనా థీ ఏకే దీవానా థా' వంటి చిత్రాలు తీశారు.

Updated Date - 2022-01-26T22:42:34+05:30 IST