'Black Day': ‘బ్లాక్ డే’ పాటించిన ముస్లిం సంస్థలు
ABN , First Publish Date - 2022-12-07T08:06:28+05:30 IST
బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని కొన్ని ముస్లిం సంస్థలు మంగళవారం ‘బ్లాక్ డే’ ('Black Day') పాటించాయి.
- టీఎంఎంకే ఆధ్వర్యంలో ధర్నా
చెన్నై, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని కొన్ని ముస్లిం సంస్థలు మంగళవారం ‘బ్లాక్ డే’ ('Black Day') పాటించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముస్లిం మున్నేట్ర కళగం ఆధ్వర్యంలో నగరంలో నిరసన, ధర్నా నిర్వహించారు. వళ్లువర్కోట్టం వద్ద ఆ పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు జవాహిరుల్లా నేతృత్వంలో జరిగిన ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మైనారిటీల సంఘం అధ్యక్షుడు పీటర్ ఆల్ఫోన్స్, సీపీఎం నాయకుడు కె.బాలకృష్ణన్, డీపీఐ ప్రధాన కార్యదర్శి చిందనై సెల్వన్, క్రైస్తవ సంఘం నాయకుడు ఇనికో ఇరుదయరాజ్, సమత్తువ డాక్టర్ల సంఘం నాయకుడు డాక్టర్ రవీంద్రనాధ్, అడయారు దర్గా ప్రధాన నిర్వాహకులు సదీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకు హాజరైన ముస్లింలంతా కలిసి ‘ప్రార్థనా హక్కులను కాపాడాలి.... ప్రార్థనా స్థలాలను కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వేలూరు, రాణిపేట, తిరుప్పూర్ సహా 150 ప్రాంతాల్లో నిర్వహించిన ధర్నాలో మహిళలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.
కాయల్పట్టినంలో బంద్... బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా తూత్తుకుడి జిల్లా కాయల్పట్టినంలో వ్యాపారులంతా బంద్ పాటించి దుకాణాలను మూసివేశారు. సీతకాది దిడల్ వద్ద రాష్ట్ర ముస్లిం మున్నేట్ర కళగం తరఫున ధర్నా కూడా నిర్వహించారు.
భద్రత కట్టుదిట్టం : బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీసుశాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రధాన రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఒక్క చెన్నైలోనే సుమారు 10 వేల మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. నగరంలోని లాడ్జీలు, మ్యాన్సన్లను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. సెంట్రల్, ఎగ్మూర్, తాంబరం రైల్వేస్టేషన్ల ప్రవేశద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుచేసి ప్రయాణికులు, లగేజీ తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతించారు. 750 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది రైల్వే ట్రాక్లను పోలీసు జాగిలాల సాయంతో తనిఖీ చేశారు. అదే విధంగా మదురై, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టణం, కన్నియాకుమారి తదితర జిల్లాల సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టుల్లో నిఘా ముమ్మరం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.20 లక్షల మందికి పైగా పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు.