BJP MLA: హోంమంత్రి కనీసం పలకరించలేదు...

ABN , First Publish Date - 2022-11-24T12:26:06+05:30 IST

ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో ప్రజలు కట్టెలతో కొట్టేందుకు వచ్చారు.. చొక్కా చిం

 BJP MLA: హోంమంత్రి కనీసం పలకరించలేదు...

- దళితుడినని చిన్నచూపా..?

- అధికార పార్టీ ఎమ్మెల్యేని చితకబాదినా ఇంత నిర్లక్ష్యమా..?

- బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి ఆగ్రహం

బెంగళూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో ప్రజలు కట్టెలతో కొట్టేందుకు వచ్చారు.. చొక్కా చింపారు, చెప్పుతో కొట్టారు.. ఈరోజు ప్రాణాలతో బయటపడాతామా అనే భయం వెంటాడింది.. ఇంతటి భయంకర పరిస్థితిని ఎదుర్కొన్నా సాటి ఎమ్మెల్యేకు కనీసం హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పలకరించి సానుభూతి చూపలేదు’ అంటూ అధికార బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి(BJP MLA Kumaraswamy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తానొక దళిత ఎమ్మెల్యే అయిన కారణంతోనే ఎంతగానో అవమాన పడినా పలకరించలేదని వాపోయారు. ఏనుగు దాడిలో మహిళ మృతి విషయాన్ని తెలిసిన వెంటనే పరామర్శించేందుకు వెళ్లానని తెలిపారు. అక్కడి ప్రజలు ఒక్కసారిగా కట్టెలతో చితకబాదేందుకు వచ్చారన్నారు. కొందరు రాళ్లు తెచ్చారని, చొక్కా చించారని వివరించారు. ఆరోజు కొందరు తనకు మద్దతుగా ఉండడంతో ప్రాణాలు దక్కాయని, లేకుంటే దారుణం జరిగేదన్నారు. ఇది చిన్నపాటి సంఘటన ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను ఫిర్యాదు చేయలేదన్నారు. తాను ఓ శాసనసభ్యుడనే విషయం గుర్తించుకోవాలన్నారు. హోంశాఖ మంత్రి సానుభూతి కోసమైనా ఏంజరిగిందని పిలిచి పలకరించలేదని, ఇలాగైతే ప్రజాప్రతినిధులు ఏం కావాలని ప్రశ్నించారు. కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా చేయకుంటే ఎలాగని హోంమంత్రి తీరుపట్ల మండిపడ్డారు. ముఖ్యమంత్రి బొమ్మై(Chief Minister Bommai), మాజీ సీఎం యడియూరప్ప ఫోన్‌చేసి పరామర్శించారని తెలిపారు. బట్టలు చినిగితే పర్వాలేదని, కానీ ప్రాణాలు పోయిఉంటే పరిస్థితి ఏమిటన్నారు. తన పట్ల హోంశాఖ మంత్రి కనీస సానుభూతి చూపకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సొంతపార్టీకి చెందిన తోటి ఎమ్మెల్యే అనేది కూడా లేకపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలన్నారు.

Updated Date - 2022-11-24T12:26:08+05:30 IST