రాంపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఘనవిజయం

ABN , First Publish Date - 2022-06-26T21:16:55+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజవర్గం ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ..

రాంపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఘనవిజయం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజవర్గం ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ లోథి ఇక్కడి నుంచి ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి మహమ్మద్ అసీం రజాపై 42,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ గెలుపు సర్టిఫికెట్‌ను లోథికి అందజేశారు.


సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ సన్నిహితుడిగా మహమ్మద్ అసీం రజాకు పేరుంది. ఈ నియోజకవర్గం నుంచి 2019లో అజాం ఖాన్ గెలుపొందారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన అజాంఖాన్ ఆ తర్వాత రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా, రాంపూర్‌లో తన గెలుపు రాంపూర్ ప్రజల విజయంగా లోథి అభివర్ణించారు. ఒక చౌకీదార్‌గా రాంపూర్ ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు.

Updated Date - 2022-06-26T21:16:55+05:30 IST