Bike Ambulance: బైక్‌ అంబులెన్స్‌లకు ఆదరణ కరువు

ABN , First Publish Date - 2022-10-11T17:15:49+05:30 IST

అత్యవసర ఆరోగ్య సేవలను అందిస్తున్న 108 అంబులెన్స్‌లకు తోడుగా బైక్‌ అంబులెన్స్‌(Bike Ambulance)లను దేశంలోనే తొలిసారిగా

Bike Ambulance: బైక్‌ అంబులెన్స్‌లకు ఆదరణ కరువు

                               - ఆసక్తి చూపని నర్సింగ్‌ విద్యార్థులు


బెంగళూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అత్యవసర ఆరోగ్య సేవలను అందిస్తున్న 108 అంబులెన్స్‌లకు తోడుగా బైక్‌ అంబులెన్స్‌(Bike Ambulance)లను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టినప్పటికీ వీటికి చెప్పుకోదగ్గ ఆదరణ కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ బైక్‌ అంబులెన్స్‌లు వినియోగించక జీవీకే క్యాంప్‌సలో వృథాగా ఉన్నాయి. 2005లో తొలిసారి బైక్‌ అంబులెన్స్‌ను నగరానికి పరిచయం చేశారు. అత్యవసర రోడ్డు ప్రమాదాల సమయంలో ట్రాఫిక్‌ జామ్‌ను అధిగమించి సులభంగా రోగిని ఆసుపత్రికి తరలించేలా వీటికి రూపకల్పన చేశారు. రాజధానిలో కొంతకాలం 19 బైక్‌ అంబులెన్స్‌లు సేవలందించేవి. సిబ్బంది కొరత, నిర్వహణ, సాంకేతిక సమస్యలు తోడై ఇవి పనిచేయడం మానేశాయి. 2005 నుంచి 2022 జూలై వరకు బైక్‌ అంబులెన్స్‌ల ద్వారా 92,905 మంది ప్రయోజనం పొందారని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. కొవిడ్‌ అవధిలో వీటి వాడకం గణనీయంగా తగ్గింది. ఆపై మళ్లీ ఊపందుకోకపోవడంతో బైక్‌ అంబులెన్స్‌లకు డిమాండ్‌ కరువైందని ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. బైక్‌ అంబులెన్స్‌లో సేవలందించేందుకు నర్సింగ్‌ విద్యార్థులు ఆసక్తి చూపించకపోవడం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది. బైక్‌ అంబులెన్స్‌లకు 2018, 2019 సంవత్సరాల్లో భారీ డిమాండ్‌ కనిపించింది. అప్పట్లో ఏకంగా 50వేల మందికి వీటి ద్వారా ప్రయోజనం అందుకున్నారు. మృత్యువుకు చేరువగా వెళ్లిన చాలా మంది బైక్‌ అంబులెన్స్‌ల కారణంగా తక్షణ చికిత్స లభించడంతో ప్రాణాపా యం నుంచి బయటపడగలిగారు. బైక్‌ అంబులెన్స్‌(Bike Ambulance) సేవలకు ప్రాచుర్యం కల్పించేందుకు, వృథాగా ఉన్న వీటిని వినియోగించుకునేందుకు తగిన ప్రయత్నాలు జరగాలని ప్రజలు కోరుతున్నారు. అనుభవజ్ఞులైన నర్సింగ్‌ విద్యార్థులు అందుబాటులో ఉంటేనే బైక్‌ అంబులెన్స్‌లను గరిష్టంగా వినియోగించుకోవడం సాధ్యమని ఈ దిశలో విద్యార్థులను ఆకట్టుకునేలా మరిన్ని సౌలభ్యాలు కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-10-11T17:15:49+05:30 IST