Bhopal: బస్సులోనే మూడున్నరేళ్ల నర్సరీ బాలికపై డ్రైవర్ అత్యాచారం

ABN , First Publish Date - 2022-09-13T22:32:04+05:30 IST

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న మూడున్నరేళ్ల బాలికపై ..

Bhopal: బస్సులోనే మూడున్నరేళ్ల నర్సరీ బాలికపై డ్రైవర్ అత్యాచారం

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న మూడున్నరేళ్ల బాలికపై స్కూలు వ్యానులోనే డ్రైవర్ అత్యాచారం చేసినట్టు పోలీసులు మంగళవారంనాడు వెల్లడించారు. ఆ సమయంలో మహిళా అటెండెంట్ కూడా బస్సులో ఉన్నట్టు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత మంగళవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది.


ఘటన ఎలా వెలుగుచూసిందంటే...

భోపాల్‌లోని ఒక ప్రముఖ ప్రైవేటు స్కూలులో బాలిక చదువుతోంది. బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. బాలిక ఇంటికి తిరిగిరాగనే పాప దుస్తులు ఎవరో మార్చినట్టు తల్లి గమనించింది. పాప బ్యాగులో స్పేర్ డ్రస్‌ ఎప్పుడూ ఉంటుంది. పాప దుస్తులు ఎవరో మార్చారంటూ స్కూలు టీచర్, ప్రిన్సిపాల్ దృష్టికి తల్లి తీసుకువెళ్లింది. తమకు ఆ విషయం తెలియదని వారు సమాధానమిచ్చారు. ఆ తర్వాత బాలిక పొత్తికడుపు, ప్రైవేటు పార్ట్స్ వద్ద నొప్పితో విలవిల్లాడటం గమనించిన తల్లిదండ్రులు ఆమెను అనునయంగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. డ్రైవర్ తనపై దురుసుగా ప్రవర్తించాడని, దుస్తులు మార్పించాడని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఆ మరుసటి రోజే వారు అధికారులకు ఫిర్యాదు చేయడం, డ్రైవర్‌ను పాప గుర్తుపట్టడంతో పోలీసులకు సోమవారంనాడు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు మొదలైందని, బస్సు డ్రైవర్, మహిళా అటెండెంట్‌ను అరెస్టు చేశామని ఏసీపీ నిధి సక్సేనా తెలిపారు. నిందితులపై ఐపీసీ 376-AB, పోస్కో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. వైద్యపరీక్షల నివేదిక కోసం ఎదురు చూస్తు్న్నామని అన్నారు.


హోం మంత్రి స్పందన...

పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. అసలు విషయాన్ని స్కూలు యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందా అని అడిగినప్పుడు, యాజమాన్యం ప్రమేయంపై విచారణ జరుగుతోందని అన్నారు. స్కూలు యాజమాన్యం పాత్ర ఉందని విచారణతో తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, బాలకపై అత్యాచారం ఘటనను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా విభాగం ఇన్‌చార్జి కేకే మిశ్రా ఖండించారు. హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-09-13T22:32:04+05:30 IST