బెంగాల్: ఉప ఎన్నికలో ఓటమితో బీజేపీలో ముసలం

ABN , First Publish Date - 2022-04-17T23:32:34+05:30 IST

అసన్‌సోల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో భారీ మెజారిటీతో ఈ సీటును కైవసం చేసుకున్న కమలం పార్టీ, తాజాగా రికార్డు ఓట్ల తేడాతో సిట్టింగ్‌ సీటును కోల్పోయింది. బెంగాల్‌లో ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు..

బెంగాల్: ఉప ఎన్నికలో ఓటమితో బీజేపీలో ముసలం

కోల్‌కతా: తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. పశ్చిమ బెంగాల్‌లోని బాలీగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఇందులో ఉప ఎన్నిక జరిగిన అసన్‌సోల్ లోక్‌సభ స్థానం బీజేపీ సిట్టింగ్ స్థానం అవ్వడం గమనార్హం.


దీంతో పార్టీలో ముసలం పెరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన మర్నాడే పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ముర్షీదాబాద్ ఎమ్మెల్యే గౌరి శంకర్ ప్రకటించారు. రాజీనామా అనంతరం ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎంసీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నప్పటికీ దానిని పార్టీ నాయకత్వం గుర్తించడం లేదని అన్నారు. మరో నేత, ఎంసీ సౌమిత్రా ఖాన్.. పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీ నాయకత్వంలో రాజకీయ అవగాహనా రాహిత్యం ఉందని, అనుభవం లేదని అన్నారు.


అసన్‌సోల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో భారీ మెజారిటీతో ఈ సీటును కైవసం చేసుకున్న కమలం పార్టీ, తాజాగా రికార్డు ఓట్ల తేడాతో సిట్టింగ్‌ సీటును కోల్పోయింది. బెంగాల్‌లో ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అసన్‌సోల్‌ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు శతృఘన్‌ సిన్హా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌పై 3.3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోనే ఇంత మెజారిటీ రావడం ఇదే తొలిసారి. సుప్రియో ఎంపీ పదవికి రాజీనామా చేసి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇక, బాలీగంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన బెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ చనిపోవడంతో ఏప్రిల్‌ 12న ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ టీఎంసీ తరఫున బరిలోకి దిగిన బాబుల్‌ సుప్రియో.. సీపీఐ(ఎం) అభ్యర్థి సైరా షా హాలిమ్‌పై 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Updated Date - 2022-04-17T23:32:34+05:30 IST