Bbmp ఎన్నికలకు సుప్రీం ఆదేశాలు
ABN , First Publish Date - 2022-05-21T17:40:08+05:30 IST
రెండేళ్లకుపైగా వాయిదా పడుతూ వస్తున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు ఇక నిర్వహించడం తప్పనిసరి అవుతోంది. రెండు నెలల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల

- రిజర్వేషన్లకు రెండు నెలల గడువు
బెంగళూరు: రెండేళ్లకుపైగా వాయిదా పడుతూ వస్తున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు ఇక నిర్వహించడం తప్పనిసరి అవుతోంది. రెండు నెలల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. వార్డుల విభజనతోపాటు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని పేర్కొంది. కొన్ని నెలలుగా వాయిదా పడిన పాలికె ఎన్నికలను జరిపించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ శివరాజ్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది వార్డుల విభజన, రిజర్వేషన్ ప్రక్రియ జరపాల్సి ఉందని ధర్మాసనానికి వివరించారు. దీంతో రెండు నెలల్లోగా ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును సీఎం బసవరాజ్ బొమ్మై స్వాగతించారు. ఎన్నికల ప్రక్రియను అమలు చేస్తామన్నారు. రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్ సుప్రీంతీర్పుపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్పును స్వాగతిస్తోందని, ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజ్యసభ, విధానపరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగియగానే బెంగళూరు పాలికె సమరంతో రాజకీయం వేడెక్కనుంది.