‘ బకింగ్‌హాం’లో రవాణాకు అడుగులు

ABN , First Publish Date - 2022-07-05T13:30:42+05:30 IST

బకింగ్‌హాం కాలువలో పడవ రవాణాకు అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ కాలువకు పునర్వైభవం తెచ్చేందుకు గతంలోనే పలు

‘ బకింగ్‌హాం’లో రవాణాకు అడుగులు

ప్యారీస్‌(చెన్నై), జూలై 4: బకింగ్‌హాం కాలువలో పడవ రవాణాకు అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ కాలువకు పునర్వైభవం తెచ్చేందుకు గతంలోనే పలు ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ముందుకు సాగడం లేదు. ఆ కాలువ పూర్తిగా శిథిలమవడం, పలు చోట్ల ఆక్రమణలకు గురై వుండడం తదితరాలతో ఈ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్‌ నుంచి విల్లుపురం జిల్లా మరక్కాణం వరకు దక్షిణ బకింగ్‌హాం కాలువలో 110 కి.మీటర్ల మేర పడవ రవాణా చేపట్టేందుకు అనువుగా కేంద్ర జలవనరుల కమిషన్‌ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. దక్షిణ బకింగ్‌హాం కాలువలో పడవ రవాణాకు ఆటంకం లేకుండా కాలువకు రెండువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు వివిధ ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొనే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.334 కోట్లతో పాత మహాబలిపురం రోడ్డు-ఈస్టుకోస్ట్‌ రోడ్డులను కలిపే పథకాన్ని కూడా అమలుపరిచేందుకు నిర్ణయించింది. ఈ రోడ్డు దురైపాక్కం నుంచి నీలాంగరై వరకు నిర్మించి ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించనున్నారు. ఈ కాలువపై పడవ రవాణా ప్రారంభమైతే, ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు పర్యాటకమూ అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.  రవాణాతో పాటు పర్యాటకుల సవారీ కూడా చేపట్టవచ్చని అధికారుల ఆలోచన.

Read more