పంత్‌కు ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2022-12-31T04:41:52+05:30 IST

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు.

పంత్‌కు ఘోర ప్రమాదం

ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బెంజ్‌

మంటలు చెలరేగి దగ్ధమైన లగ్జరీ కారు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత క్రికెటర్‌

రిషబ్‌కు తప్పిన ప్రాణాపాయం.. వైద్యుల వెల్లడి

త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు, క్రికెటర్ల ట్వీట్లు

న్యూఢిల్లీ/డెహ్రాడున్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నాడు. 25 ఏళ్ల పంత్‌ తన మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌యూవీలో ఢిల్లీ నుంచి స్వస్థలం రూర్కీ వెళ్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఢిల్లీ-డెహ్రాడూన్‌ హైవేపై ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లా మంగ్లూర్‌ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో పంత్‌ ఒక్కడే ఉన్నాడు. ప్రమాద తీవ్రతకు భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. అటువైపుగా వెళ్తున్న బస్సులోని డ్రైవర్‌తో పాటు మరికొందరు సాయం చేయడంతో పంత్‌ కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడు నిద్రమత్తులో కారును నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని హరిద్వార్‌ సీనియర్‌ ఎస్పీ అజయ్‌ సింగ్‌ వెల్లడించారు. పంత్‌ను డెహ్రాడున్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని చికిత్స చేస్తున్న వైద్యులు వివరించారు. రిషభ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ఓ ప్రకటన విడుదల చేసింది. పంత్‌ నుదురు భాగం చిట్లినట్లయిందనీ, 2 చోట్ల చర్మం తెగిందని, వీపుపై కాలిన గాయాలున్నాయనీ, కుడి మోకాలి లిగ్మెంట్‌ కదిలినట్లు ఎక్స్‌రేలో వెల్లడైందని బీసీసీఐ కార్యదర్శి జై షా ఆ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు కుడిచేతి మణికట్టు, కుడికాలి చీలమండ, పాదానికి కూడా గాయాలయ్యాయని పేర్కొన్నారు. ‘ప్రస్తుతానికి పంత్‌ ఆరోగ్యం బాగుంది. ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని జై షా వివరించారు.

అమ్మను సర్‌ప్రైజ్‌ చేద్దామని

వచ్చే నెల ప్రారంభంలో శ్రీలంకతో జరగనున్న టి20, వన్డే సిరీ్‌సలకు పంత్‌ ఎంపిక కాలేదు. దీంతో విరామం దొరికింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు అకస్మాత్తుగా ఊరెళ్లి కుటుంబ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తుదామని భావించాడు. ఆ ఉద్దేశంతోనే బయలుదేరగా.. అంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ‘మా ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు పంత్‌ పూర్తి స్పృహలోనే ఉన్నాడు. అతడితో నేను మాట్లాడా. అమ్మను సర్‌ప్రైజ్‌ చేద్దామని మా ఇంటికి బయల్దేరా అని చెప్పాడు’ అని రూర్కీలోని స్థానిక ఆస్పత్రిలో పంత్‌కు వైద్యం చేసిన డాక్టర్‌ సుశీల్‌ నగర్‌ తెలిపాడు. కాగా, పంత్‌ వైద్యానికయ్యే ఖర్చులన్నీ తమ ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తెలిపారు. అతడికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన పంత్‌.. ఆ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, మాజీ క్రికెటర్లు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ప్రార్థించారు.

పంత్‌ ఎవరో తెలియదు

పంత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనప్పుడు మొదట ఆ ఘటనను చూసింది ఓ బస్‌ డ్రైవర్‌ సుశీల్‌ మన్‌. పంత్‌ను కాపాడింది కూడా అతనే. అయితే తాను కాపాడింది ఓ క్రికెటర్‌ అన్న విషయం కూడా తనకు తెలియదని సుశీల్‌ చెప్పుకొచ్చాడు. ‘నేను బస్సును నడుపుకొంటూ హరిద్వార్‌ నుంచి వస్తున్నా. ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే బస్సును పక్కకు ఆపి అక్కడికి వెళ్లా. మంటల్లో చిక్కుకున్న కారులోని ఓ వ్యక్తి.. నా పేరు రిషభ్‌ పంత్‌.. క్రికెటర్‌ను.. మా అమ్మకు ఫోన్‌చేయండి అని అన్నాడు. బస్సులోని మరికొందరం కలిసి అతడిని వెంటనే బయటకు లాగాం. నేను క్రికెట్‌ చూడను. పంత్‌ ఎవరో కూడా నాకు తెలియదు’ అని చెప్పుకొచ్చాడు.

పంత్‌ నగలు, డబ్బు చోరీ

పంత్‌ కారు ప్రమాదం సమయంలో కొందరు మానవత్వాన్ని మరచిపోయి అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న కారు వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు.. పంత్‌ను కాపాడాల్సింది పోయి అతని వద్దనున్న విలువైన వస్తువులను అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. అతని వద్దనున్న డబ్బుతో పాటు మెడలోని బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌ను ఎత్తుకెళ్లారట.

Updated Date - 2022-12-31T04:41:53+05:30 IST