అమెరికా అమ్ములపొదిలో ‘బీ-21 రైడర్’
ABN , First Publish Date - 2022-12-03T04:07:28+05:30 IST
అమెరికా అమ్ములపొదిలో మరో అత్యాధునిక యుద్ధ విమానం చేరింది. పెంటగాన్ రూపొందించిన ఆరో తరానికి చెందిన సైనిక విమానం న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ బీ-21 రైడర్‌ను కాలిఫోర్నియాలో
అణు స్టెల్త్ బాంబర్‌ను ఆవిష్కరించనున్న పెంటగాన్
ఆరో తరం అత్యాధునిక యుద్ధ విమానం.. ఒక్కో విమానం తయారీకి 6,132 కోట్లు
పటిష్ఠ రక్షణ వ్యవస్థల్లోకి చొచ్చుకెళ్లే సామర్థ్యం..
ప్రపంచంలో ఎక్కడైనా కచ్చితత్వంతో దాడులు
వాషింగ్టన్, డిసెంబరు 2: అమెరికా అమ్ములపొదిలో మరో అత్యాధునిక యుద్ధ విమానం చేరింది. పెంటగాన్ రూపొందించిన ఆరో తరానికి చెందిన సైనిక విమానం న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ బీ-21 రైడర్‌ను కాలిఫోర్నియాలో పామ్‌డేల్ వైమానిక స్థావరంలో శుక్రవారం ఆవిష్కరించారు. గత 30ఏళ్లలో అమెరికా అభివృద్ధి చేసిన కొత్త బాంబర్ విమానం ఇదే కావడం విశేషం. ఒక్కో బీ-21 రైడర్ ఖరీదు దాదాపు రూ.6,132 కోట్ల వరకూ ఉంటుంది. అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థల్లోకి చొచ్చుకుపోవడంతోపాటు ప్రపంచంలో ఎక్కడైనా పూర్తి కచ్చితత్వంతో, శత్రు దేశ రాడార్లకు చిక్కకుండా దాడులు చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పటి వరకూ రూపొందించిన యుద్ధ విమానాల్లో ఇదే అత్యంత అధునాతనమైనదని నిర్మాణ సంస్థ నాథ్రోప్ గ్రమ్మన్ కార్పొరేషన్ ప్రకటించింది. సంప్రదాయ, అణ్వస్త్రాలతోపాటు లేజర్ ఆయుధాలను కూడా ప్రయోగించే సామర్థ్యం వీటి ప్రత్యేకత అని వివరించింది. ఇప్పటి వరకూ అగ్రరాజ్యానికి అందుబాటులో ఉన్న స్టెల్త్ బాంబర్ బి-2 స్పిరిట్ విమానాల స్థానాన్ని బి-21 రైడర్లు భర్తీ చేయనున్నాయి. ప్రారంభంలో ఆరు బి-21 రైడర్లు సిద్ధం చేయనున్నారు. వీటి సంఖ్యను 100కు పెంచాలని అమెరికా వైమానిక దళం యోచిస్తోంది. 2023 ప్రారంభంలో ఈ యుద్ధ విమానం సేవలు అమెరికా సేనలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనాతో భవిష్యత్తు వివాదాలపై నెలకొన్న ఆందోళనలకు ఇది దీటైన సమాధానంగా అమెరికా పేర్కొంటోంది.