సంప్రదాయ ఔషధాలపై ‘ఆయుష్‌ మార్క్‌’

ABN , First Publish Date - 2022-04-21T09:45:04+05:30 IST

భారత్‌లో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇకపై ‘ఆయుష్‌ మార్క్‌’ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

సంప్రదాయ ఔషధాలపై ‘ఆయుష్‌ మార్క్‌’

చికిత్స కోసం వచ్చే విదేశీయులకు ‘ఆయుష్‌ వీసా’ 

‘హీల్‌ ఇన్‌ ఇండియా’ పెద్ద బ్రాండ్‌గా మారవచ్చు

గ్లోబల్‌ ఆయుష్‌ సమ్మిట్‌లో ప్రధాని


గాంధీనగర్‌, ఏప్రిల్‌ 20: భారత్‌లో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇకపై ‘ఆయుష్‌ మార్క్‌’ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సంప్రదాయ ఔషధ పరిశ్రమను ప్రోత్సహించేందుకు దేశంలో తయారయ్యే నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తుల ప్రామాణికతను సూచించేలా త్వరలోనే ఆయుష్‌ గుర్తును అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అలాగే సంప్రదాయ చికిత్స కోసం భారత్‌కు వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేక విభాగం కింద ‘ఆయుష్‌ వీసా’ మంజూరు చేస్తామని చెప్పారు. గుజరాత్‌లోని మహాత్మా మందిర్‌లో మూడు రోజులపాటు జరగనున్న ‘గ్లోబల్‌ ఆయుష్‌ ఇన్వె్‌స్టమెంట్‌, ఇన్నొవేషన్‌ సమ్మిట్‌’ను బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మారిషస్‌ ప్రధానమంత్ర

ప్రవింద్‌ జుగ్‌నాథ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆయుష్‌ అంటే ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి అని చెప్పారు. ‘త్వరలోనే భారత్‌లో ఆయుష్‌ గుర్తును పరిచయం చేస్తాం. దేశంలోని నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తులకు ఇది ప్రామాణికంగా నిలుస్తుంది. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పరిశీలించిన ఉత్పత్తులకు ఈ మార్క్‌ను కేటాయిస్తాం. ఈ గుర్తు నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామనే నమ్మకాన్ని కలిగిస్తుంది. సంప్రదాయ వైద్యం కేరళలో పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడింది. భారత దేశమంతటా ఈ శక్తి ఉంది. ఈ దశాబ్దంలో ‘హీల్‌ ఇన్‌ ఇండియా’ (భారత్‌లో స్వస్థత) పెద్ద బ్రాండ్‌గా మారవచ్చు’ అని మోదీ అన్నారు.


పెట్టుబడులకు అపరిమిత అవకాశాలు 

భారత్‌లో సంప్రదాయ చికిత్స పొందాలనుకునే వారికి ఆయుష్‌ వీసా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారు. అలాంటి వారికోసం ప్రత్యేక వీసాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఆయుర్వేద రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలున్నాయని చెప్పారు. సంప్రదాయ వైద్య రంగంలో స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ఆయుష్‌ మం త్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రక్తనాళాల్లో బలహీనత, నరాల క్షీణత కారణంగా కంటిచూపు కోల్పోయిన కెన్యా మాజీ ప్రధాని కుమార్తె రోజ్‌మేరీ ఒడింగాకు కేరళలో ఆయుర్వేద చికిత్సతో చూపు తిరిగొచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు.

భారత్‌లోనే కాకుండా విదేశీయులకూ ఆయుష్‌ చికిత్స మేలు చేసిందనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచిందన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు కెన్యా నుంచి రోజ్‌మేరీ గాంధీనగర్‌కు వచ్చారు. 2018లో తాను కంటిచూపు సమస్యతో బాధపడ్డానని.. జర్మనీ, జపాన్‌, దక్షిణాఫ్రికా, చైనా దేశాలకు వెళ్లినా నయం కాలేదని ఆమె వెల్లడించించారు. చివరిగా కేరళకు వచ్చి ఎర్నాకుళంలోని శ్రీధరియాం ఆయుర్వేదిక్‌ కంటి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని, ఆ తర్వాత తన కంటిచూపు మెరుగైందన్నారు.


టెడ్రో్‌సను తులసీభాయ్‌ అని పిలుస్తా: మోదీ

గ్లోబల్‌ ఆయుష్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రో్‌సకు ప్రధాని మోదీ గుజరాతీ పేరు సూచించారు. టెడ్రోస్‌ అభ్యర్థన మేరకు ఆయనను ‘తులసీభాయ్‌’ అనే పేరుతో సంబోధించారు. ‘మీరు నా కోసం ఏదైనా పేరు నిర్ణయించారా...’ అని టెడ్రోస్‌ ప్రశ్నించగా.. ‘మిమ్మల్ని తులసీభాయ్‌ అని పిలవడం నాకిష్టం’ అని మోదీ అన్నారు. తులసీభాయ్‌ పేరునే ఎందుకు సూచించారో కూడా వివరించారు. తరాలుగా భారతీయులు తులసి మొక్కను పూజిస్తున్నారని చెప్పారు. కాగా, గిరిజన జనాభా అధికంగా ఉండే గుజరాత్‌లోని దాహోడ్‌ జిల్లాలో రూ.20,000 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ రైలింజన్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు. 

Updated Date - 2022-04-21T09:45:04+05:30 IST