IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2022-11-18T08:14:26+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌ దీవికి చేరువగా గురువారం ఉదయం అల్పవాయుపీడనం ఏర్పడినట్లు స్థానిక వాతావరణ పరిశోధన

IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం

చెన్నై, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌ దీవికి చేరువగా గురువారం ఉదయం అల్పవాయుపీడనం ఏర్పడినట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం(Atmospheric Research Centre) అధికారులు ప్రకటించారు. ఈశాన్యరుతుపవనాల తీవ్రత, ఉపరితల ఆవర్తనం కారణంగా కురిసిన భారీ వర్షాల నుండి తేరుకుంటున్న ఉత్తరాది జిల్లాలలో ఈ నెల 20 నుండి రెండు రోజులపాటు కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అ మేరకు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పవాయుపీడనం రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారి, పడమటి దిశగా, వాయవ్య బంగాళాఖాతం వైపు వేగంగా కదలనుందని తెలిపారు. దీనితో కడలూరు, కాంచీపురం నాగపట్టినం, తిరువళ్లూరు, తిరువారూరు జిల్లాల్లోనూ, కారైక్కాల్‌, పుదుచ్చేరి ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వివరించారు. అల్పపీడనం కారణంగా గురువారం రాత్రి నుండి సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 45 నుండి 50. కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపారు. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై(Vellore, Tirupattur, Ranipet, Tiruvannamalai) జిల్లాలోనూ 48 గంటలలోగా చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

చేపలవేట మానండి...

బంగాళాఖాతంలో అల్పవాయుపీడనం ఏర్పడటంతో శుక్రవారం నుండి జాలర్లు చేపలవేటకు వెళ్ళకూడదని రాష్ట్ర మత్స్యశాఖ కమింషనర్‌ పళనిస్వామి హెచ్చరికను జారీ చేశారు. తదుపరి ఉత్తర్వు జారీ అయ్యేంతవరకూ రాష్ట్రంలోని జాలర్లు చేపలవేట మానుకోవాలని తెలిపారు. ఈ నెల 21 వరకూ అలల ఉదృతి అధికంగా ఉంటుందని, గంటకు 65 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయన్నారు. ప్రస్తుతం నడి సముద్రంలో చేపలవేట సాగిస్తున్న జాలర్లంతా వీలయినంత త్వరగా తీరానికి చేరాలని కూడా ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-11-18T08:14:26+05:30 IST

Read more