స్కూలు, సాంస్కృతిక భవనంపై రష్యా బాంబు దాడి.. 21 మంది మృతి
ABN , First Publish Date - 2022-03-18T03:01:09+05:30 IST
ఉక్రెయిన్‌పై గత నెల 24న దురాక్రమణకు తెగబడిన రష్యా రోజురోజుకు దాడిని మరింత తీవ్రతరం

కీవ్: ఉక్రెయిన్‌పై గత నెల 24న దురాక్రమణకు తెగబడిన రష్యా రోజురోజుకు దాడిని మరింత తీవ్రతరం చేస్తూనే ఉంది. బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తూ భవనాలను నేలమట్టం చేస్తోంది. రష్యా సేనలు పలు నగరాలను ఇప్పటికే తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. మరియుపోల్ వంటి నగరాల్లో ప్రజలను బందీలుగా చేసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
తాజాగా, తూర్పు ఉక్రెయిన్ నగరంపై రష్యా దళాలు జరిపిన దాడిలో 21 మంది మరణించగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖార్కివ్‌కు సమీపంలోని మెరేఫాలోని ఓ స్కూల్, సాంస్కృతిక కేంద్రంపై రష్యన్ సేనలు బాంబుల వర్షం కురిపించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.
గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. రష్యా ఏజెన్సీల గణాంకాల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7 వేల మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో మరణించారు. 14 వేల మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై దాడిని ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం నిన్న రష్యాను ఆదేశించింది.