Prime Minister: పెరిగిన మోదీ ఆస్తులు
ABN , First Publish Date - 2022-08-10T00:58:01+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆస్తుల విలువ గత ఏడాది కన్నా

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆస్తుల విలువ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం మార్చి 31నాటికి పెరిగాయి. ఈ ఆస్తులు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. గుజరాత్ (Gujarat)లో ఉన్న ఓ భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ఆయనకు స్థిరాస్తులు లేవు. ఈ వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) వెబ్సైట్లో ప్రచురించారు.
పీఎంఓ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం మోదీ ఆస్తుల విలువ 2022 మార్చి 31నాటికి రూ.2,23,82,504/- ఆయనకు స్థిరాస్తులు లేవు. 2021 మార్చి 31నాటికి ఆయనకు గల స్థిరాస్తుల విలువ రూ.1.1 కోట్లు. ఈ స్థిరాస్తి గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. దీనిని మరో ముగ్గురితో కలిసి 2002 అక్టోబరులో కొన్నారు. దీనిలో నలుగురికీ సమాన వాటాలు ఉన్నాయి. ఆయన తన వాటాను విరాళంగా ఇచ్చేశారు. దీంతో ఈ ఏడాది ఇక ఆయనకు స్థిరాస్తులు లేవు.
మోదీ చరాస్తుల విలువ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం రూ.26.13 లక్షలు పెరిగింది. 2022 మార్చి 31నాటికి ఆయన వద్ద నగదు రూపంలో రూ.35,250 ఉంది. ఆయనకు రూ.9,05,105 విలువైన పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, రూ.1,89,305 విలువైన జీవిత బీమా పాలసీలు ఉన్నాయి.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2022 మార్చి 31నాటికి ఆయనకుగల చరాస్తుల విలువ రూ.2.54 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.2.97 కోట్లు.