నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-10-17T15:34:14+05:30 IST

రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో ఏర్పడిన ఏకనాయకత్వ

నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు

చెన్నై: రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో ఏర్పడిన ఏకనాయకత్వ వివాదం ఈ సమావేశాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (ఓపీఎ్‌స)ను ఆ పదవి నుంచి తొలగించినట్లు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) మూడుసార్లు రాసిన లేఖపై స్పీకర్‌ అప్పావు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీ నుంచి బహిష్కరించిన ఓపీఎస్‌ పక్కనే కూర్చోవడానికి ఈపీఎస్‌ ఇష్టపడటం లేదు. ఓపీఎస్‌ సీటు మార్చాలని కూడా స్పీకర్‌కు ఈపీఎస్‌ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పీకర్‌ అప్పావు సోమవారం మధ్యాహ్నమే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే కొన్ని సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. మాజీ స్పీకర్‌ సేడపట్టి ముత్తయ్య, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించనున్నారు. ఇదే విధంగా కోవై తంగం సహా మాజీ శాసనసభ్యుల మృతికి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత స్పీకర్‌  అప్పావు సభను వాయిదా వేస్తారు. తరువాత ఉదయం 11 గంటలకు స్పీకర్‌  ఛాంబర్‌లో శాసనసభ వ్యవహారాల మండలి సభ్యులు సమావేశమవుతారు. ఆ సమావేశంలో శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులపాటు జరపాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాలు మూడురోజలపాటు జరుగుతాయని తెలుస్తోంది.


అన్నాడీఎంకే వాకౌట్‌?

ఇదిలా ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్‌   వైఖరికి నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్‌ చేస్తారని తెలుస్తోంది. పార్టీ సభాపక్ష నాయకుడిగా మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ను నియమించినట్లు ఈపీఎస్‌ పంపిన లేఖపై ఆయన ఎలాంటి  నిర్ణయం తీసుకోనందుకు నిరసనగా వీరంతా తొలిరోజే గలాభా సృష్టించనున్నారని చెబుతున్నారు. అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడి పదవికి సంబంధించి ఈపీఎస్‌, ఓపీఎస్‌ వేర్వేరుగా లేఖలు పంపినందువల్లే స్పీకర్‌ అప్పావు తక్షణ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే సమన్వయకర్తగానే తాను కొనసాగుతున్నానని, పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకత్వంపై ఈపీఎస్‌ లేఖపై నిర్ణయం తీసుకునేటప్పుడు తన అభిప్రాయాల ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఓపీఎస్‌ స్పీకర్‌కు లేఖ రాశారు. ఆ మేరకు స్పీకర్‌ ఇంకా ఓపీఎస్‌ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోలేదు. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్‌ చేసి ఈ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తారని తెలుస్తోంది. 


స్పీకర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఓపీఎస్‌

పెరంబూర్‌ : శానససభ ప్రతిపక్ష ఉపనేతగా తనను కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై స్పీకర్‌ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం తెలిపారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా శాసనసభలో ప్రజల సమస్యలు ప్రస్తావిస్తామన్నారు. అన్నాడీఎంకేపై కోటిన్నర మంది కార్యకర్తల నమ్మకానికి అనుగుణంగా శాసనసభ సమావేశాలో పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని ఓపీఎస్‌ తెలిపారు.

Updated Date - 2022-10-17T15:34:14+05:30 IST