ED Summons: నన్ను అరెస్ట్ చేయండి : శివసేన ఎంపీ సంజయ్ రౌత్
ABN , First Publish Date - 2022-06-27T20:34:19+05:30 IST
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate

ముంబై : ఓ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసినట్లు తెలుసుకున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విటర్ వేదికగా ఉగ్రరూపం ప్రదర్శించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఓ పెద్ద కుట్ర జరుగుతోందని, భీకర యుద్ధానికి శివసైనికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
శివసేన (Shiv Sena) పార్టీలో తిరుగుబాటు రావడంతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray)కు గట్టి మద్దతుగా నిలిచినవారిలో సంజయ్ రౌత్ (Sanjay Raut) ఒకరు. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి, వారు జీవచ్ఛవాలని, వారి ఆత్మలు మరణించాయని అన్నారు.
ఈ నేపథ్యంలో ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఓ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు కోసం హాజరుకావాలని సంజయ్ రౌత్‌కు సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో మంగళ వారం హాజరుకావాలని ఆదేశించింది.
దీంతో సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా తనను నిలువరించేందుకు జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. సోమవారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్లో, ‘‘ఈడీ నన్ను పిలిచిందని ఇప్పుడే నాకు తెలిసింది. మంచిది! మహారాష్ట్రలో మహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బాలా సాహెబ్ తాలూకు శివసైనికులమైన మేము గొప్ప యుద్ధంలో పోరాడుతున్నాం. ఇదంతా నన్ను ఆపేందుకు జరుగుతున్న కుట్ర. మీరు నా తలను తెగనరికినా, నేను గువాహటి మార్గంలోకి రాను. నన్ను అరెస్ట్ చేయండి. జైహింద్!’’ అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈడీ, సీబీఐ, తదితర వ్యవస్థల ద్వారా ఒత్తిడి తేవడం వల్లే ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు వచ్చిందని ఆరోపిస్తోంది. షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గువాహటిలో బస చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా, సంజయ్ రౌత్ రూ.1,034 కోట్ల విలువైన పాట్రా చావల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆస్తులను ఈడీ ఏప్రిల్‌లో జప్తు చేసింది. ఇటువంటి చర్యలకు తాను భయపడేది లేదని ఆయన హెచ్చరించారు.