పార్టీలకు విలువే లేదా?

ABN , First Publish Date - 2022-08-04T10:36:29+05:30 IST

‘‘రాజకీయ పార్టీలకు మీ దృష్టిలో విలువే లేదా?’’ అని మహారాష్ట్రలోని సీఎం ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

పార్టీలకు విలువే లేదా?

  • మీ అభ్యంతరాలను మార్చి తీసుకురండి
  • సీఎం శిండే వర్గానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 3 : ‘‘రాజకీయ పార్టీలకు మీ దృష్టిలో విలువే లేదా?’’ అని మహారాష్ట్రలోని సీఎం ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వర్గం దాఖలుచేసిన పిటిషన్లలోని అంశాలను పరిగణించనక్కల్లేదని శిండేవర్గం చేసిన వాదనలపై, కోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ పిటిషన్లపై వ్యక్తపరిచిన అభ్యంతరాలను పునఃసవరించి తిరిగి సమర్పించాలని ఆ వర్గాన్ని ఆదేశించింది. పిటిషన్లకు ఉన్న న్యాయపరిధిని గురువారం తొలి అంశంగా చేపట్టి తేలుస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలో ఒక చీలికవర్గంగా ఏర్పడి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటుచేసి బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. 


ఈ నేపథ్యంలో అఽధికారం కోల్పోయిన ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిండే వర్గంలోని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, పార్టీ గుర్తు ‘బాణా’న్ని తమకే కేటాయించాలంటూ పలు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలుచేసింది. చీలికలు, విలీనాలు, ఫిరాయింపులు, అనర్హతతో ముడిపడిన ఈ రాజకీయ వివాదంపై జస్టిస్‌ కృష్ణ మురారీ, జస్టిస్‌ హిమాకోహ్లీలతో కలిసి చీఫ్‌ జస్టిస్‌ రమణ బుధవారం ఇరుపక్షాల వాదనలను మరోసారి ఆలకించారు. ఠాక్రే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ వాదనలు వినిపించారు. అనర్హత నుంచి తప్పించుకోవాలంటే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం నడుచుకుని మరో రాజకీయ పార్టీలో శిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కలిసిపోవడం ఒక్కటే మార్గమని సిబ్బల్‌ వాదించారు. ప్రజాప్రతినిధిగా ఎన్నిక అయినంతమాత్రాన రాజకీయపార్టీతో పేగు బంధం తెంచుకుంటానంటే కుదరదని, పార్టీతో తనకు నిమిత్తం లేదని అనలేరని వాదించారు. శిండే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఠాక్రే వర్గం లేవనెత్తిన అంశాల్లో పస లేదని ఆయన వాదించారు. కాగా, సుప్రీంకోర్టులో న్యాయమే గెలుస్తుందని ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. 

  

శిండే వర్గం నేత కారుపై దాడి

సీఎం ఏక్‌నాథ్‌ శిండే వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి ఉదయ్‌ సామంత్‌పై కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక దాడిచేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు శివసేన (ఠాక్రేవర్గం) పార్టీ పుణె శాఖ అధ్యక్షుడు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. 


సుప్రీంకు పెగాసస్‌ కమిటీ నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్‌ నిఘా వ్యవహారంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ.. తన తుది నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. కొద్దిరోజుల క్రితమే సుప్రీంకు కమిటీ అందజేసిన ఈ నివేదికలో విషయాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసు తదుపరి విచారణకు సంబంధించి తేదీని సుప్రీం ఇంకా ప్రకటించలేదుగానీ.. ఆగస్టు 12న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2022-08-04T10:36:29+05:30 IST