తెలుగు భాషకు న్యాయం చేద్దాం

ABN , First Publish Date - 2022-02-22T15:28:57+05:30 IST

పోటీ ప్రపంచంలో ముందు కెళ్లేందుకు అన్ని భాషలు నేర్చుకోవడం సమంజసమే అయినా, మాతృభాషను మాత్రం మరవొద్దని తెలుగు ప్రముఖ పారిశ్రామికవేత్త, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన

తెలుగు భాషకు న్యాయం చేద్దాం

- పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్‌రెడ్డి 

- ఎస్‌కేపీసీలో ఘనంగా మాతృభాషా దినోత్సవం 

- భాషా సేవకులకు పురస్కారాల ప్రదానం


ప్యారీస్‌(చెన్నై): పోటీ ప్రపంచంలో ముందు కెళ్లేందుకు అన్ని భాషలు నేర్చుకోవడం సమంజసమే అయినా, మాతృభాషను మాత్రం మరవొద్దని తెలుగు ప్రముఖ పారిశ్రామికవేత్త, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కె. అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. జార్జ్‌టౌన్‌లోని కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) ‘సృజన తెలుగు భాషా మండలి’ ఆధ్వర్యంలో సోమవారం ‘భాష- అభిలాష’ పేరిట మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అనిల్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భాష కోసం అశువులు బాసిన ఐదుగురు విద్యార్థుల త్యాగాన్ని స్మరించుకొనేలా ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందని, గత 19 సంవత్సరాలుగా 180 దేశాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జార్జ్‌టౌన్‌లోని ఎస్‌కేపీసీ కళాశాలకు ప్రత్యేకత ఉందని, అమరజీవి పొట్టిశ్రీరాములు పుట్టిన ప్రాంతం ఇదేనని వివరించారు.  తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా మాతృభాషలో మాట్లాడుకుంటేనే తెలుగుభాషకు న్యాయం జరుగుతుందని అనిల్‌ కుమార్‌రెడ్డి అన్నారు.  

ఈ కార్యక్రమానికి ఎస్‌కేపీసీ కళాశాల కరచాలకులు గుగ్గిలం రమేష్‌, ప్రిన్సిపాల్‌ డా.టి.మోహనశ్రీ, తెలుగుశాఖ అధ్యాపకురాలు డా.పీఎస్‌ మైథిలి తదితరులు కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. ఎస్‌కేపీడీ ట్రస్టీలు ఊటుకూరు శరత్‌కుమార్‌, నాలం శ్రీకాంత్‌, విద్యార్థుల కార్యదర్శులు నేతి మౌనిక, బి.రాజ్యలక్ష్మి, రూపశ్రీ మేరుపు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉపకారవేతనాలను పంపిణీ చేశారు. అనంతరం తెలుగు భాషకు ఎనలేని సేవలందిస్తున్న భారతి మహిళా కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు డా. నిర్మలా పళనివేలుకు ‘ధృవతార’, పెరంబూర్‌ సాహితీ సమితి కార్యదర్శి డా.టీఆర్‌ఎస్‌ శర్మకు ‘అభిజ్ఞ’, పవర్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ డా.సుజాత గోధకు ‘ఉద్భవ’ పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-02-22T15:28:57+05:30 IST