ఉక్రెయిన్ సంక్షోభం... కేంద్రానికి పినరయి విజయన్ లేఖ...

ABN , First Publish Date - 2022-02-24T23:37:32+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనుకకు రప్పించేందుకు

ఉక్రెయిన్ సంక్షోభం... కేంద్రానికి పినరయి విజయన్ లేఖ...

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనుకకు రప్పించేందుకు తక్షణమే చర్యలు ప్రారంబించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ రాష్ట్రాలు కోరాయి. రష్యా దాడి నేపథ్యంలో తన గగనతలంలో సివిలియన్ విమానాల రాకపోకలను ఉక్రెయిన్ నిషేధించింది. దీంతో దాదాపు 20 వేల మంది భారతీయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు రాసిన లేఖలో, తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని, వారి భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ రాష్ట్రానికి చెందినవారు 2,320 మంది ఉక్రెయిన్‌లో చదువుతున్నారని, వీరు తమ చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆ దేశంలోనే ఉన్నారని చెప్పారు. వారికి రక్షణ కల్పించేవిధంగా ఆ దేశ అదికారులతో మాట్లాడాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. వారిని సాద్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. 


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మహారాష్ట్రవాసుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీరి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా కలిసి పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రకు చెందినవారు, ముఖ్యంగా విద్యార్థులు సురక్షితంగా తిరిగి రావడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయాలని థాకరే ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. 


ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పని చేస్తామని హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖత్తార్ చెప్పారు. 24x7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో అన్ని విధాలుగా సహకరిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు రాసిన లేఖలో, విద్యార్థులతో తాము నిరంతరం మాట్లాడుతున్నామని, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తున్నామని తెలిపారు. 


కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ మాట్లాడుతూ, తమ రాష్ట్రానికి చెందిన 10 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో  ఉన్నారని, స్వదేశానికి రావడం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 


తెలంగాణా బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో, తమ రాష్ట్రానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకున్నారని చెప్పారు. 


ఇదిలావుండగా, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ విలేకర్లతో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారి కుటుంబ సభ్యులు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని చెప్పారు. వారిని తిరిగి భారత దేశానికి రప్పించడానికి కృషి చేస్తున్నామని, ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులతో సహా దాదాపు 18,000 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసినందువల్ల భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-02-24T23:37:32+05:30 IST