Indian Railways: టికెట్ రిజర్వేషన్ కౌంటర్లను రైల్వే మూసేస్తుందా? మరి రిజర్వేషన్ ఎలా?

ABN , First Publish Date - 2022-08-19T22:46:17+05:30 IST

ఆన్‌లైట్ టికెట్ బుకింగ్ సర్వీస్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లలోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల

Indian Railways: టికెట్ రిజర్వేషన్ కౌంటర్లను రైల్వే మూసేస్తుందా? మరి రిజర్వేషన్ ఎలా?

న్యూఢిల్లీ: ఆన్‌లైట్ టికెట్ బుకింగ్ సర్వీస్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లలోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు అందరి చేతుల్లోనూ ఉండడంతో రిజర్వేషన్, ఆన్‌లైన్ బుకింగ్, షాపింగ్స్ వంటివాటిని ఇంట్లో కూర్చుని చిటికెలో పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు దాదాపు ఖాళీగా కనిపిస్తున్నాయి.


స్మార్ట్‌ఫోన్లు (Smartphone) లేనివారు, ఇంటర్నెట్ (Internet) సౌకర్యం అందుబాటులో లేనివారు మాత్రమే రిజర్వేషన్ కౌంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ కౌంటర్లను మూసేయాలని రైల్వే నిర్ణయించిందని ఇక, రిజర్వేషన్లు కౌంటర్లు గత చరిత్రేనంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ వార్త వైరల్ కావడంతో రైల్వే నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు మొదలయ్యాయి. 


విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అబద్ధమని, అలాంటి నిర్ణయమేదీ రైల్వే తీసుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, అటువంటి ప్రతిపాదన కూడా లేదని వెస్ట్ సెంట్రల్ రైల్వే (West Central Railway) వివరణ ఇచ్చింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండూ కొనసాగుతాయని పేర్కొంది. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ ట్రైన్ టికెట్ బుకింగ్ యాప్‌తోపాటు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. 


రైల్వేకు సంబంధించి రెండుమూడు రోజుల క్రితం కూడా ఓ వార్త హల్‌చల్ చేసింది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఇప్పటి వరకు అందిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రైల్వే ఎత్తివేసిందన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపైనా స్పందించిన రైల్వే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది ప్రయాణికులను తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఐదేళ్లలోపు చిన్నారులు తల్లిదండ్రులతో ఉచితంగా ప్రయాణించొచ్చు. వారికి సీటు కానీ, బెర్త్ కానీ కావాలనుకుంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే స్పష్టతనిచ్చింది.  



Updated Date - 2022-08-19T22:46:17+05:30 IST