Bihar BJP ministers to resign: బీహార్ బీజేపీ మంత్రుల రాజీనామా?
ABN , First Publish Date - 2022-08-09T18:09:21+05:30 IST
బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని జేడీ(యూ) నిర్ణయించిన నేపథ్యంలో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి....

పాట్నా(బీహార్): బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని జేడీ(యూ) నిర్ణయించిన నేపథ్యంలో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీ(యూ)ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం 12.30 గంటలకు రాష్ట్ర గవర్నరును కలవనున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన 16 మంది మంత్రులు గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలవాలని నిర్ణయించారు. బీజేపీ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ నివాసంలో 16 మంది బీజేపీ మంత్రులు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం బీజేపీ మంత్రులంతా గవర్నరును కలిసి వారి పదవులకు రాజీనామా సమర్పించాలని నిర్ణయించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ బీహార్ నేతలు మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విలేఖరుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. సీఎంగా నితీష్ కుమార్ కు తాము మద్ధతు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నాలోని రబ్రీదేవి నివాసానికి వచ్చారు. భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించేందుకు ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా లాలూ నివాసంలో సమావేశమయ్యారు. మొత్తం మీద బీహార్ రాజకీయాలు వేడెక్కాయి.
